ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇది వాయుగుండంగా మారే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట 35 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఐఎండి అంచనా వేసింది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.
తమిళనాడు, యానాం మధ్య తీరందాటే అవకాశముందని ముందుగా అంచనా వేశారు. అయితే ఇది ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మధ్య తీరందాటవచ్చని తెలుస్తోంది. దీని ప్రభావం సోమవారం వరకు ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
వరి నూర్పిడి చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. వరి కోసి పనలపై ఉన్న పొలాల్లో రైతులు ధాన్యం మొలకెత్తకుండా ఎకరాకు 25 కేజీల ఉప్పును పనలపై చల్లాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారు.