పదిరోజుల పాటు అరెస్టు వద్దంటూ ఆదేశం
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు ఊరట లభించింది.కేటీఆర్ ను ఈ నెల 30వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ కు సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహణలో భాగంగా తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదించగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారని కోర్టుకు తెలిపిన న్యాయవాది సుందరం, ఇందుకోసం 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సీజన్ 10 నిర్వహణలో ఓ సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందని కోర్టుకు తెలిపారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.