ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్‌కు షాక్ తగిలింది. విద్యుత్ దొంగతనం చేసినందుకు గాను యూపీ విద్యుత్ శాఖ అతనికి రూ.1.91కోట్ల జరిమానా విధించింది. జరిమానా తక్షణం చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. అదే ఊపులో అతని ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసేసింది. దొంగతనం చేసినందుకు కేసు కూడా పెట్టింది.
యూపీ విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు కలిసి ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్ ఇంట్లో గురువారం సోదాలు చేసారని సబ్ డివిజనల్ ఆఫీసర్ సంతోష్ త్రిపాఠీ ధ్రువీకరించారు. జియావుర్ రెహమాన్ జరిమానా మొత్తాన్ని కట్టకపోతే, రికవరీ సర్టిఫికెట్ జారీ అవుతుందని వెల్లడించారు.
సోదాల్లో భాగంగా అధికారులు ఎంపీ ఇంట్లో ఉన్న కరెంటు మీటర్లను జప్తు చేసారు. మీటర్లను ట్యాంపర్ చేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారన్నది ఆరోపణ. వాటిని పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపించారు. వాటి స్థానంలో కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు.
ఎంపీ ఇంటికి 2 కిలోవాట్ల లోడ్ వరకే అనుమతి తీసుకున్నారు. కానీ ఏకంగా 16.5కిలోవాట్ల లోడ్ ఉండే భారీ విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. ఎంపీ ఇంట్లో 50కి పైగా ఎల్ఈడీ బల్బులు, 3 స్ప్లిట్ ఏసీలు, 2 రిఫ్రిజిరేటర్లు, 1 కాఫీమేకర్, 1 గీజర్, 1 మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నాయి. అవన్నీ కలిపితే 16.5 కిలోవాట్ల లోడ్ వినియోగం అవుతోంది.
ఎంపీ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో 10కిలోవాట్ల సోలార్ ప్యానెల్, 5కిలోవాట్ల జనరేటర్ ఉన్నాయని చెప్పారు. కానీ సోలార్ ప్యానెల్స్ పనిచేయడం లేదు. కొత్త స్మార్ట్ మీటర్లు 5.5 కిలోవాట్ల పవర్‌లోడ్ ఉన్నట్లు చూపించాయి అని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడించారు.
కరెంటు దొంగతనం ఆరోపణలు పక్కన పెడితే, విద్యుత్ శాఖ అధికారులను ఎంపీ బర్క్, అతని సహచరులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిలో ఒక సంఘటన గురించి జిల్లా ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయి చెప్పారు. ‘‘ఎంపీ తండ్రి మామ్లుక్ ఉర్ రెహమాన్ బర్క్ నివాసానికి విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలకు వెళ్ళారు. ఎంపీ తండ్రి వారిని అడ్డుకున్నాడు. పైగా బెదిరించాడు. ఆ సంఘటనను విద్యుత్ శాఖ అధికారులు వీడియో తీసారు. దాన్ని సాక్ష్యంగా ప్రవేశపెడతాం’’ అని ఎస్పీ వివరించారు.
సంభాల్ జిల్లాలో ఆక్రమణలు, విద్యుత్ చౌర్యం సంఘటనల మీద జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. గత మూడు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఆ వ్యవధిలో అధికారులు 1250 కేసులు నమోదు చేసారు, రూ.5.2కోట్ల జరిమానాలు విధించారు. ఆ డ్రైవ్‌లో భాగంగానే ఎంపీ నివాసాన్ని కూడా తనిఖీ చేసారు.
సంభాల్‌లో పెద్దసంఖ్యలో మసీదులు, మదరసాలు కూడా విద్యుత్ చౌర్యం చేస్తున్నాయని బైటపడింది. దీపా సరాయ్, నయీ సరాయ్ ప్రాంతాల్లో తెల్లవారుజామున చేసిన దాడుల్లో మసీదు మీద అక్రమ పవర్‌హౌస్ బైటపడింది. దానినుంచి వందకు పైగా ఇళ్ళకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఒక మసీదులో ఏకంగా 59 ఫ్యాన్లు, 30 లైట్ పాయింట్లు, ఒక రిఫ్రిజిరేటర్ ఉన్నాయి. వాటికి విద్యుత్ మీటర్ మాత్రమే లేదు.
జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో విద్యుత్ చౌర్యం పారిశ్రామిక స్థాయిలో ఎంత జరుగుతోందో బైటపెట్టాయి. ఇలాంటి అక్రమాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు.