పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానిచారంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల నిరసన కొనసాగుతుండగానే స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదన జరిగింది. గురువారం నాడు జరిగిన ఆందోళనలో పలువురు అధికార కూటమికి చెందిన ఎంపీలు గాయపడ్డారు. తమను రాహుల్ గాంధీ నెట్టివేయడంతోనే పడిపోయామని గాయపడ్డ ఎంపీలు తెలిపారు.దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.
పెద్దలసభలోనూ మారని కాంగ్రెస్ తీరు…
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటు చేసిన కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పెద్దలసభ ఆమోదం తెలిపింది. అయితే కాంగ్రెస్ సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై వ్యవహారంపై ఇండీ కూటమి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యాపారాలపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శీతాకాల సమావేశంలో పలు కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును పాలకపార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ లోక్ సభలో అడుగుపెట్టారు.