కరోనా, డెంగీ, మలేరియా లాంటి వ్యాధి అయిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి… అన్న వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి తన క్రైస్తవ అస్తిత్వాన్ని చాటుకున్నాడు. కొద్దిరోజుల్లో రాబోయే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరు బెతెల్ మెట్రోపాలిటన్ కెథెడ్రల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉదయనిధి ఆ వ్యాఖ్యలు చేసాడు.
తన ప్రసంగంలో ఉదయనిధి క్రైస్తవ విద్యాసంస్థలతో తన అనుబంధాన్ని ఘనంగా ప్రస్తావించాడు. డాన్‌బాస్కో స్కూల్లోనూ, లయోలా కాలేజీలోనూ చదువుకున్న సంగతిని గుర్తు చేసాడు. గత యేడాది క్రిస్మస్ కార్యక్రమంలో తాను చేసిన ప్రకటన గురించి మరోసారి ప్రస్తావించాడు. ‘‘నేను కూడా క్రైస్తవుణ్ణే అని నేను గర్వంగా చెప్పుకున్నాను. దాంతో సంఘీయులకు కడుపులో మంట మొదలైంది. ఇవాళ నేను మళ్ళీ చెబుతున్నాను. నేను ఒక క్రైస్తవుణ్ణి అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను’’ అని ఉదయనిధి విస్పష్టంగా చెప్పాడు.
అదే సమయంలో, తనకు సెక్యులర్ డ్రామాను కూడా కొనసాగించాడు ఉదయనిధి. విమర్శల తీవ్రతను తగ్గించుకోడానికి వ్యూహాత్మకంగా మరికొన్ని మాటలు కూడా కలిపాడు. ‘‘మీరు నన్ను క్రైస్తవుడు అనుకుంటే నేను క్రైస్తవుణ్ణి. మీరు నన్ను ముస్లిం అనుకుంటే నేను ముస్లింని. మీరు నన్ను హిందూ అనుకుంటే నేను అందరికీ చెందిన వాడిని. అన్ని మతాలకూ మూలం ప్రేమే. ప్రతీ మతమూ తోటివారిని ప్రేమించమనే మనకు బోధిస్తుంది’’ అని నీతికబుర్లు చెప్పాడు. తాను, తన తండ్రీ హిందూ వ్యతిరేకులు, నాస్తికులమని చెప్పుకుంటారు అన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, అన్ని మతాల వారినీ ఆదరిస్తున్నట్టు నటించే క్రమంలో ఇలా మాట్లాడాడు.
ఉదయనిధి తనకు వ్యక్తిగతంగా క్రైస్తవమతంతో సంబంధాలు ఉన్న సంగతిని ఏనాడూ దాచుకోలేదు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ముందు, మంత్రిగా ప్రమాణం చేసేముందూ చర్చ్ పాస్టర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఉదయనిధి స్టాలిన్ 2022లో చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు. అప్పుడు కూడా ‘‘నేను క్రైస్తవుణ్ణని గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ సంఘీలందరికీ మండిపోతూ ఉంటుంది. దేవదాయ మంత్రి శేఖర్‌బాబు హల్లేలూయా అంటున్నాడు, ఉదయనిధి క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ కడుపుమంట చల్లారదు’’ అని వ్యాఖ్యానించాడు.
అలా, ఉదయనిధి స్టాలిన్ క్రైస్తవంపై తన ప్రేమను ప్రకటిస్తూ, హిందూధర్మంపై తన ద్వేషాన్ని వెళ్ళగక్కాడు. తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటిచెప్పాడు.