జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు
జమిలి ఎన్నికల బిల్లును లోక్సభ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణిస్తోన్న జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సమూలంగా మార్చేదిలా ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. జేపీసీ వేయాలంటూ డిమాండ్ చేశాయి. ఈ బిల్లుపై విస్తృత స్థాయిలో చర్చ చేపట్టేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని అధికార బీజేపీ ఎంపీలు అంగీకరించారు. దీంతో జమిలి బిల్లుపై జేపీసీ వేశారు.
జేపీసీలో సభ్యుల సంఖ్యను పెంచాలనే ప్రతిపక్షాల డిమాండ్లను అధికార బీజేపీ అంగీకరించింది. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలకు జేపీసీలో చోటుకల్పించారు. ఇప్పటికే జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే.
జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలో మూడు సవరణలు చేయాల్సి ఉంది. కొన్ని సవరణలకు రెండింట మూడు వంతుల మెజారిటీ సాధించాల్సి ఉంది. రాజ్యసభలో బీజేపీకి సరైన మెజారిటీ లేదు. అందుకే ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతోంది. రాబోయే రెండేళ్లలో రాజ్యసభలో ఎన్డీయే సభ్యుల బలం పెరుగుతుంది. 2027లో నియోజకవర్గాల విభజన జరగాల్సి ఉంది. ఆ తరవాత జమిలి ఎన్నికలకు రంగం సిద్దం చేసే అవకాశం ఉంది. అయితే 2029లోనా 2034లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
శీతాకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగిశాయి. నిరవధికంగా సభలు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు మణిపూర్లో హింస, సంభల్ అల్లర్లు, రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టింది. కీలక సమస్యలపై చర్చకు అధికార బీజేపీ సహకరించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక గురువారం పార్లమెంటులో ఇద్దరు బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోసివేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.