అండర్-19 మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు సూపర్ -4 మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
నేడు శ్రీలంక తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ , శ్రీలంకను కట్టడి చేసింది. శ్రీలంకజట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ఆయుషి నాలుగు వికెట్లు పడగొట్టగా, పరుణిక రెండు, కేసరి, షబ్నమ్ చెరొక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయం సాధించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష 24 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఓపెనర్ కమలిని ( 28), మిథిల (17*) రాణించడంతో భారత్ విజయం ఖాయమైంది.
శ్రీలంక బౌలర్లలో ఛమోదీ ప్రబోద మూడు వికెట్లు తీయగా, షశిని గింహాని రెండు వికెట్లు పడగొట్టింది .
‘సూపర్ ఫోర్’ దశలో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం భారత్ తలపడి నెగ్గింది.బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 80 పరుగులు సాధించింది.
భారత బౌలర్లలో ఆయుషి 3, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసి విజయం సాధించింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ,46 బంతుల్లో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.