ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు మధ్య తీరందాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో ఈ అల్పపీడనం తీరందాటే అవకాశముంది. దీని ప్రభావంతో అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కృష్ణపట్నం ఓడరేవులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వరి నూర్పిడి వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.
గడచిన 24 గంటల్లో ఏపీలో 18 మి.మీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది. శనివారం సాయంత్రానికి అల్పపీడనం తీరందాటవచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతుందా, బలహీనపడుతుందా అనే దానిపై రేపటికి స్పష్టత రానుంది.