అమెరికా ఫెడ్ నిర్ణయం స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. తాజాగా వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్, వచ్చే ఏడాది మాత్రం రెండుసార్లు కన్నా తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరవాత సంస్కరణలు ఉంటాయనే సంకేతాలు అందుతున్నాయి. దీనికితోడు అమెరికాలో మరోసారి ఆర్థిక సంక్షోభం తప్పదనే సంకేతాలు కూడా పెట్టుబడిదారులను నిరుత్సాహానికి గురిచేశాయి.
ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఓ దశలో 1200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి, 964 పాయింట్ల నష్టంతో 79029 వద్ద ముగిసింది. 247 పాయింట్ల నష్టంతో నిఫ్టీ సూచీ 23951 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో హిందూస్థాన్ యూనీలీవర్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
రూపాయి దారుణంగా పతనమైంది. డాలరుతో రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా ఒక డాలరుకు 85.06కు తగ్గింది. వృద్ధిరేటు మందగించడం, వాణిజ్యలోటు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దిగుమతులు పెరిగి ఎగుమతులు మందగించడం కూడా రూపాయి పతనానికి దారితీసింది. ముడిచమురు బ్యారెల్ 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు బంగారం 2650 డాలర్లకు చేరింది.