పార్లమెంటులో నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడిన ఘటనలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ దాఖలయింది. గాయపడిన ఎంపీలు ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు.
రాజ్యసభలో ఓ చర్చ సందర్భంగా అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఇండీ కూటమి పక్షాలు పార్లమెంటులో ఇవాళ ఆందోళన చేపట్టాయి. ఆ సందర్భంలో పార్లమెంటు ఆవరణలో బీజేపీ, ఇండీ కూటమి ఎంపీలు పరస్పరం తారసపడ్డారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోసేసారని, ఆయన తన మీద పడడంతో తాను కింద పడిపోయాననీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి చెప్పారు. ఆ ఘటనలోనే తనకూ గాయాలయ్యాయని మరో బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆ సంఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. బీజేపీ లీగల్ టీమ్ సభ్యులు, ఎంపీలు అయిన అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్‌లతో కూడిన బృందం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీ మీద వారు ఫిర్యాదు చేసారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీల మీద భౌతికదాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ప్రతాప్ చంద్ర సారంగికి తల మీద గాయమైందని, పెద్దగా రక్తస్రావమైందనీ, ఆయనకు కుట్లు వేయవలసి వచ్చిందనీ వైద్యులు వెల్లడించారు. సారంగి ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆ గొడవలో గాయపడిన రెండో ఎంపీ ముకేష్ రాజ్‌పుత్, వాగ్వాదం జరుగుతుండగానే స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చారు కానీ ఆయన రక్తపోటు పెరిగిపోయిందని, ఆయన ఇంకా ఆందోళనగానే ఉన్నారనీ వైద్యులు చెప్పారు. ముకేష్‌కు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.
బీజేపీ ఎంపీలను తాను తోసివేసానన్న ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. తాను పార్లమెంటులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, వారే తనను బెదిరించారనీ రాహుల్ ఆరోపించారు. ఆ గొడవలో తమ నాయకుడు మల్లికార్జున ఖర్గేను కూడా తోసేసారని రాహుల్ చెప్పుకొచ్చారు.