కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బిఎం పార్వతి ప్రమేయం ఉన్న ముడా భూముల కుంభకోణం ఆ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వివాదానికి సంబంధించి సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేసారు. ఆ కుంభకోణానికి సంబంధించి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ కోట్ల రూపాయలు లంచం ఇవ్వచూపారని ఆయన ఆరోపించారు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో విలువైన భూములను ముఖ్యమంత్రి భార్యకు కట్టబెట్టడంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో సుదీర్ఘకాలంగా అవినీతిపై పోరాటం చేస్తున్న సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఆ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ వ్యవహారంపై ఫిర్యాదు చేసి, సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేసారు.
ఇప్పుడాయన ఆ కేసుకు సంబంధించి కొత్త ఆరోపణలు చేసారు. సుమారు యేడాది క్రితం సిద్దరామయ్య భార్యకు సన్నిహితులైన ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చారని ఆయన చెప్పారు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరుతూ భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని కృష్ణ ఆరోపించారు. దానికి ఒప్పుకోనందుకు తన మీద ఒత్తిళ్ళు పెరిగాయన్నారు. తనను, తన కుటుంబాన్నీ బెదిరించే చర్యలకు పాల్పడ్డారని కృష్ణ తీవ్ర ఆరోపణలు చేసారు.
మైసూరుకు చెందిన రాజకీయవేత్త హర్ష, స్థానిక జర్నలిస్టు శ్రీనిధి ఈ విషయమై తన దగ్గరకు వచ్చారని కృష్ణ చెప్పుకొచ్చారు. హర్ష తనను సిద్దరామయ్య భార్య పార్వతికి, ఆ కుటుంబానికీ కావలసిన వాడినని చెప్పారట. హర్షకు, కృష్ణకూ మధ్య చర్చలు జరగడానికి మధ్యవర్తిగా జర్నలిస్టు శ్రీనిధి వ్యవహరించారట. వారు తనతో జరిపిన చర్చల ఫోన్ రికార్డులు, వీడియో టేపులతో ఆయన మళ్ళీ ఫిర్యాదు చేసారు.
గతేడాది డిసెంబర్ 13న ముడా ప్రధాన కార్యాలయంలో హర్ష తనతో మాట్లాడారని కృష్ణ చెప్పారు. కుంభకోణానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలన్న తన అభ్యర్ధనను ఉపసంహరించుకోవాలని హర్ష కోరారట. ‘ఇప్పుడు జరుగుతున్న లోకాయుక్త విచారణ సరిపోతుంది, సిబిఐ విచారణ మా సమస్య, దానిగురించి మీరు పట్టించుకోనక్కరలేదు’ అని హర్ష తనతో అన్నట్లు కృష్ణ చెప్పారు. ఆ పని చేస్తే భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెబుతామని కూడా హర్ష చెప్పారని కృష్ణ ఆరోపించారు. అంతకుముందు డిసెంబర్ 12న కూడా కృష్ణ ఇంటికి వెళ్ళి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసారట.
ముడా కార్యాలయంలో సమావేశం తర్వాత మళ్ళీ డిసెంబర్ 15న హర్ష, శ్రీనిధి ఇద్దరూ కలిసి కృష్ణ ఇంటికి వెళ్ళారట. అప్పుడు వారు కృష్ణ కుమారుణ్ణి ప్రలోభపెట్టి పని జరిపించుకోడానికి ప్రయత్నించారట. వారు కృష్ణ కొడుక్కి ఒక వీడియో చూపించారట. అందులో రూ.1.5కోట్ల నగదు ఉందట. ఇదే కేసుకు సంబంధించి పనిచేస్తున్న మరో కార్యకర్తకు అంత నగదు ఇచ్చామని, కృష్ణకు కూడా అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనీ వారు చెప్పారట. అయినప్పటికీ తాను కాని, తన కుమారుడు కానీ లొంగలేదని కృష్ణ చెప్పారు.
ఆ తర్వాత తనమీద కె.ఆర్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదయిందని కృష్ణ చెప్పారు. మరోవైపు తనకు, తన కుటుంబానికీ బెదిరింపులు కూడా వచ్చాయని వివరించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కృష్ణ ఈ యేడాది జనవరి 18న బెంగళూరు ఈడీ కార్యాయంలో మరోసారి ఫిర్యాదు చేసారు. తన ఆరోపణలను నిరూపించగల పత్రాలన్నింటినీ ఈడీకి సమర్పించినట్లు కృష్ణ చెప్పారు. మర్నాడు, అంటే జనవరి 19న, లోకాయుక్త ఎస్పికి, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసానని వివరించారు. వారు తన ఇంటికి వచ్చిన, తమతో మాట్లాడిన సీసీటీవీ దృశ్యాలను సాక్ష్యాలుగా అప్పగించానని చెప్పారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కృష్ణ ఆరోపించారు. ‘మొదట డబ్బుతో నా నోరుమూయించాలని ప్రయత్నించారు. అది విఫలమయ్యేసరికి ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించి నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు, నామీద తప్పుడు కేసులు పెట్టారు’ అని కృష్ణ ఆరోపించారు.