భారత్-చైనా మధ్య ఆరు అంశాలపై ఏకాభిప్రాయం…!
కైలాస మానసరోవర యాత్ర చేయాలనుకుంటున్నవారి ఆశ త్వరలో సాకారమయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి భారత్- చైనాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని వినికిడి.
భారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణలతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్ళగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ సంసిద్ధత వ్యక్తం చేయడంతో బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ భేటీకి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారధ్యం వహించారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని సమయావేశంలో నిర్ణయించారు.
టిబెట్ మీదుగా మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలు పంచుకోవడం, వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.
భారత్, చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యారు. తాజాగా జరిగిన సమావేశం 23వది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.