పార్లమెంటులో ఇవాళ హైడ్రామా నడుస్తోంది. అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపిస్తూ హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సందర్భంలో, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసివేసారు. ఆ క్రమంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు.
ఒడిషాకు చెందిన ప్రతాప్ సింగ్ సారంగిని మొదట ఆస్పత్రికి తరలించగా, మరికాసేపటికే మరో బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ కూడా గాయపడినట్లు గుర్తించారు. ముకేష్ రాజ్‌పుత్‌కు కూడా తీవ్ర గాయాలవడంతో ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. పలువురు బీజేపీ ఎంపీలతో పాటు తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ముకేష్ రాజ్‌పుత్‌ను పరామర్శించారు.
రాహుల్ గాంధీ తోపులాటలోనే తనకు గాయాలయ్యాయని ముకేష్ చెప్పుకొచ్చారు. అంతకుముందు ప్రతాప్ సారంగి కూడా అదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆవరణలో తాము నిలబడి ఉండగా, రాహుల్ తన పక్కనున్న ఎంపీని తోసారని, ఆయన వచ్చి తనమీద పడడంతో తాను కింద పడిపోయాననీ సారంగి చెప్పారు.