గోవా 450 ఏళ్ళకు పైగా పోర్చుగీస్ కాలనీగా ఉండిపోయింది. అలాంటి గోవా విమోచన, సార్వభౌమత్వం కోసం భారతదేశం చేసిన నిరంతర పోరాట ప్రయత్నం. రాజకీయ పక్షాలు, కార్యకర్తలు, సాధారణ పౌరులు కలసికట్టుగా పాల్గొన్న ఆ ఉద్యమం, వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయ ప్రజల దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది.
గోవా సత్యాగ్రహం ప్రారంభం:
1955 జూన్ 13న భారతీయ జనసంఘ్ నాయకుడు జగన్నాథ రావు జోషి, కర్ణాటకకు చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలతో కలిసి ‘గోవా సత్యాగ్రహం’ ప్రారంభించడం గోవా విమోచన ఉద్యమంలో కీలక ఘట్టం. ఆర్ఎస్ఎస్‌కు చెందిన 3వేల మంది కార్యకర్తలు ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వారిలో పెద్దసంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. వారు గోవా సరిహద్దులు చేరేసరికి వారిపై పోర్చుగీసు బలగాలు అమానుషంగా దాడి చేసాయి. బుడతకీచు పోలీసులు లాఠీచార్జి, ఫైరింగ్ చేసారు.
1955 ఆగస్టు 15న పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 5వేల మంది సత్యాగ్రహులు గోవాలోకి ప్రవేశించారు. ‘పోర్చుగీస్, క్విట్ ఇండియా’ అంటూ నినాదాలు చేసారు. వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారని తెలిసినా, పోర్చుగీసు సైనికులు నిరంతరాయంగా తుపాకులు కాలుస్తూ గుళ్ళవర్షం కురిపించారు. ఆరోజు 51మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు, 300మందికి పైగా గాయపడ్డారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 9వ వార్షికోత్సవం రోజు జరిగిన ఆ ధిక్కార ఉద్యమం, గోవాను పోర్చుగీసు వారినుంచి విముక్తం చేయాలన్న భారతీయుల దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది.
ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులు, సంస్థలు:
ఎందరో సాంస్కృతిక, రాజకీయ నాయకులు క్రియాశీలంగా పాల్గొనడం గోవా విమోచన ఉద్యమాన్ని బలోపేతం చేసింది. ప్రముఖ సంగీత విద్వాంసులు సుధీర్ ఫాడ్కే అలియాస్ బాబూజీ తన పాటలతో ఉద్యమానికి తోడ్పాటు అందించారు. సరస్వతీ ఆప్టే నేతృత్వంలో రాష్ట్రీయ సేవికా సమితి మహిళామణులు పుణేలో సత్యాగ్రహులకు ఆహారం సమకూర్చడంతో పాటు వారికి రవాణా ఏర్పాట్లు కూడా చేసారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న మిగతా అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరి సంఖ్య కంటె భారతీయ జనసంఘ్ కార్యకర్తల సంఖ్య చాలాచాలా ఎక్కువ. గోవా విమోచన పట్ల జనసంఘ్‌కు ఉన్న నిబద్ధత అది.
యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవన్స్ (యుఎఫ్‌జి) వంటి సంస్థలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. యుఎఫ్‌జి నాయకుడు వినాయకరావు ఆప్టే, ఆజాద్ గోమంతక్ దళ్ నాయకులు ప్రభాకర్ విఠల్ సేనారి, ప్రభాకర్ వైద్యల నేతృత్వంలో కార్యకర్తలు దాద్రా, నగర్ హవేలీ వంటి ప్రాంతాలను విముక్తం చేసారు.
సవాళ్ళు, అణచివేతలు:
గోవా విమోచన ఉద్యమాన్ని పోర్చుగీసు పాలకులు ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించారు. విమోచన ఉద్యమకారులను అమానుషంగా చిత్రహింసలు పెట్టారు. బుడతకీచుల చేతిలో సత్యాగ్రహులు ఎదుర్కొన్న చిత్రహింసల గురించి పాంచజన్య పత్రిక సవివరంగా రాసింది. ఆ హింసల వల్లే అమీర్‌చాంద్ గుప్తా వంటి జనసంఘ్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ మహిళలు ఎంతమాత్రం వెనుకడుగు వేయలేదు. సుభద్రాబాయి వంటి మహిళా నేతల శౌర్యం అసమానంగా నిలిచిపోయింది. ఛాతీలో బులెట్ గుచ్చుకున్నా, సుభద్రాబాయి జాతీయ జెండాను నేలమీద పడకుండా పట్టుకుని నిలబడ్డారు, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.
రాజకీయ సమీకరణాలు, విమర్శలు:
గోవా విమోచన ఉద్యమం భారత రాజకీయ నాయకుల మధ్య ఉన్న విభేదాలను స్పష్టంగా పట్టించింది. పోర్చుగల్ నాటోలో సభ్య దేశం కావడంతో వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ప్రపంచ దేశాల నుంచి ప్రతికూల ప్రభావం పడుతుందేమో అని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆందోళన చెందారు. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మాధవ సదాశివరావు గోళ్వాల్కర్ నెహ్రూ వైఖరిని తప్పుపట్టారు, భారతదేశ ప్రజలను రక్షించేలా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని డిమాండ్ చేసారు.
గోవా విమోచన ఉద్యమానికి గోవా వాసులే నాయకత్వం వహించాలని, శాంతియుతంగా ఉద్యమం చేయాలనీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఆ వైఖరిని జనసంఘ్ తీవ్రంగా విమర్శించింది. గోవా స్వతంత్రంతో మాత్రమే భారతదేశపు సార్వభౌమత్వం సమగ్రం కాగలదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సంశయాత్మక వైఖరిని జనసంఘ్ ప్రధాన కార్యదర్శి దీనదయాళ్ ఉపాధ్యాయ దుయ్యబట్టారు. గోవా ప్రజలు అప్పటికే ఎన్నో త్యాగాలు చేసారని, వారికి భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలనీ డిమాండ్ చేసారు.
అంతర్జాతీయ, జాతీయ భావాలు:
గోవా ఉద్యమానికి అంతర్జాతీయ స్పందన మిశ్రమంగా ఉండింది. నిరాయుధులైన సత్యాగ్రహులను ఊచకోత కోసినా ప్రపంచ శక్తులు మౌనంగానే ఉండిపోయాయి. గోవా అంశంపై బ్రిటిష్ మీడియా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న సంగతిని ప్రస్తావించిన జనసంఘ్, భారత్ ఇంకా ఎందుకు బ్రిటిష్ కామన్వెల్త్‌లో సభ్యురాలిగా ఉందంటూ నిలదీసింది.
దేశీయంగా చూసుకుంటే గోవా విషయంలో కాంగ్రెస్ ఉదాసీన వైఖరి భారత రాజకీయాల్లో విభేదాలను సృష్టించింది. జనసంఘ్ సహా ప్రతిపక్షాలు గోవా విమోచనకు పోలీస్ చర్య చేపట్టాలని డిమాండ్ చేసాయి. 1955 ఆగస్టు 8న భారత్‌లోని పోర్చుగీసు రాయబార కార్యాలయాన్ని మూసివేయడం వంటి చిన్నచిన్న చర్యలు చేపట్టాడు కానీ నెహ్రూ పోలీస్ చర్య జరపడానికి మాత్రం భయపడ్డాడు.
గోవా విమోచన ఉద్యమపు వారసత్వం:
గోవా విమోచన ఉద్యమం 1961 వరకూ కొనసాగింది. ఆ యేడాది మిలటరీ ఆపరేషన్ ద్వారా గోవా, డామన్, డయ్యూ ప్రాంతాలు భారతదేశంలో విలీనమయ్యాయి. అయితే, వాటి విముక్తి కోసం సత్యాగ్రహులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయి. గోవా విమోచన ఉద్యమం భారతీయుల సమష్ఠి స్ఫూర్తికి, మాతృభూమిలో ఒక్క అంగుళం కూడా పరాయి పాలనలో ఉండిపోకూడదన్న భావనకూ నిదర్శనంగా నిలిచింది.
గోవా విమోచన కేవలం రాజకీయ విజయం కాదు. సార్వభౌమత్వానికీ, న్యాయానికీ భారతదేశం ఎంత కట్టుబడి ఉందో చూపించే సజీవ తార్కాణం. జనసంఘ్ వంటి సంస్థల నాయకత్వంలో సత్యాగ్రహులు చూపిన ధైర్యసాహసాలు, ఎంతమాత్రం తగ్గని సామాన్య ప్రజల స్ఫూర్తి గోవాను భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగంగా చేసాయి.