డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం అమెరికా డాలరుకు 84.96 వద్ద ముగిసిన మార్కెట్, ఇవాళ రూపాయి విలువ 85.06కు పడిపోయింది. 2025లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను సవరిస్తుందనే అంచనాలతో రూపాయి పతనమైంది. రూపాయితోపాటు, ఇండోనేషియా, మలేషియా, ఇరాన్ దేశాల కరెన్సీలు కూడా దారుణంగా పతనమయ్యాయి.
ముఖ్యంగా దేశంలో పెరిగిపోతోన్న వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. వృద్ధి మందగించడం, వాణిజ్యలోటు, ఎగుమతులు క్షీణించడం లాంటి అంశాలు రూపాయి విలువ పతనానికి దారితీసింది. ఎన్నడూ లేని విధంగా వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు విదేశాల నుంచి బంగారం, ముడిచమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఇందుకు భారత్ అమెరికా డాలర్లలో చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఇది కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.
రూపాయి విలువ పతనం కొందరికి లాభం, మరికొందరికి భారం కానుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు ఇక నుంచి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. విదేశీ దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి. ఇక దేశం నుంచి ఐటీ ఎగుమతులు, ఫార్మా రంగాల ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రూపాయి పతనం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా నవంబరులో వాణిజ్యలోటు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.