కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంటు ఆవరణలో బీభత్సం సృష్టించారు. తోటి ఎంపీ ఒకరిని తోసేసారు. ఆయన మీద పడడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడిపోయారు. ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయనను తరలించారు.
బాలాసోర్ ఎంపీ అయిన ప్రతాప్ చంద్ర సారంగి ఆ సంఘటన గురించి వివరించారు. ‘‘రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోసేసారు. ఆయన వచ్చి నామీద పడ్డారు. దాంతో నేను కింద పడిపోయాను. రాహుల్ ఆ ఎంపీని తోసేటప్పుడు నేను పార్లమెంటు మెట్ల మీద నిలబడి ఉన్నాను’’ అని చెప్పారు.
69 ఏళ్ళ వయసున్న ప్రతాప్ చంద్ర సారంగి తలకు పెద్ద గాయమే అయింది. తల ఎడమ పక్క దెబ్బ తగిలి రక్తం కారింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.
మరో వీడియోలో రాహుల్ గాంధీ, గాయపడిన ప్రతాప్ సారంగిని చూస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. సారంగిని ఇతరులు లేవదీసే ప్రయత్నం చేస్తుంటే రాహుల్ అసలేమీ జరగనట్లు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
కాంగ్రెస్ నేతృత్వంలో ఇండీ కూటమి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఇవాళ నిరసన చేపట్టారు. ఆ సమయంలో వారికి బీజేపీ ఎంపీలు తారసపడ్డారు. వారిని రాహుల్ గాంధీ తోసేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగం గురించిన చర్చలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని తప్పుపడుతున్నాయి. అయితే అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎన్నోసార్లు అవమానించిందనీ, రాజ్యసభ విషయంలో ఆ పార్టీ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందనీ బీజేపీ విమర్శిస్తోంది.