కేసుల విచారణలో విశేష ప్రతిభ చూపడంతో పాటు విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి డీజీపీ ద్వారక తిరుమలరావు అభినందనలు తెలిపారు. అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డులను సిబ్బందికి మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జులై నుంచి సెప్టెంబర్ 2024 మూడో త్రైమాసానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులు దక్కాయి. కేసుల పూర్వాపరాలు , కేసుల పరిష్కారంలో వినియోగించిన సాంకేతికత, వినూత్న విధానాలను పూర్తిగా పరిశీలించిన సీఐడీ అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ నాలుగు ఉత్తమ కేసులు ఎంపిక చేశారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ వి. ఎన్ మణికంఠ చందోలు నేతృత్వంలోని టీమ్ మొదటి బహుమతి గెలుచుకుంది. చిత్తూరు జిల్లా పరిధిలోని గుడిపాల ఏటీఎం లో దొంగతనం జరిగింది. దీనిని సాంకేతికత సహాయంతో త్వరితగతిన ఛేదించడంతో మొదటి బహుమతి దక్కింది.
గుంతకల్లు రైల్వే పోలీస్ ఎస్పీ రాహుల్ మీనా నేతృత్వంలోని టీమ్ కు సెకండ్ ప్రైజ్ దక్కింది. హిందూపూర్ రైల్వే పోలీస్ పరిధిలో మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి బంగారం, నగదు, లాప్ ట్యాబులు, మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసును సమర్ధంగా ఛేదించినందుకు ద్వితీయ బహుమతిని అందజేశారు.
కర్నూల్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలోని టీమ్ జిల్లా పరిధిలోని ఆస్పరి మండల పరిధిలో జరిగిన హత్య కేసును చాకచక్యంగా ఛేదించింది. ఇందుకు తృతీయ బహుమతిని అందించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణా రావు నేతృత్వంలోని టీమ్ కు కన్సోలేషన్ బహుమతిని అందజేశారు.అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోని గుడిలో చోరీ జరగగా వెంటనే కేసు నమోదు చేసి 11 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 40 పాత దొంగతనం కేసులను ఈ టీమ్ ఛేదించింది.
మొదటి బహుమతి పొందిన కేసుకు లక్ష రూపాయల ప్రైజ్ మని, రెండో బహుమతికి రూ.60 వేలు, మూడో బహుమతి పొందిన కేసుకు 40 వేల రూపాయలు, కన్సోలేషన్ బహుమతి పొందిన కేసుకు రూ.20 వేలు ప్రైజ్ మనీ అందజేశారు.
ఈ నెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా శ్రమపడిన కర్నూల్, విజయనగరం, కృష్ణాజిల్లాల ఎస్పీలు, వారి టీమ్లకు డీజీపీ ప్రశంస పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.