ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే 48 గంటల్లో ఈ అల్పపీడనం తమిళనాడు దక్షిణ కోస్తా మధ్య తీరందాటే అవకాశముంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉత్తరకోస్తా జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంట 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని శనివారం సాయంత్రం వరకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శనివారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా వరి నూర్పిడి చేస్తోన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.
గడచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటల్లో ఉత్తరకోస్తాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అంచనా. యానాం సమీపంలో అల్పపీడనం తీరం దాటి, బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.