భారత రాజ్యాంగం మీద రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఆరెస్సెస్ నాయకులకు అంబేద్కర్ మీద తీవ్రమైన ద్వేషం ఉందని ఆరోపించారు. మనుస్మృతిని నమ్మేవారికి అంబేద్కర్ అంటే పడదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యంగ్యంగా విమర్శించారు.
అంబేద్కర్‌ను అనుసరించేది తామేనని కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంది. నిజానికి కాంగ్రెస్ కథ దానికి పూర్తి విరుద్ధం. భారత రాజ్యాంగ నిర్మాతతో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును పరిశీలిస్తే నిర్లక్ష్యం, వ్యతిరేకత, చులకనగా వ్యవహరించడమే కనిపిస్తాయి.
ఇప్పుడు తాము అమితంగా గౌరవించేస్తున్నాం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్‌ను ఎలా నిర్లక్ష్యం చేసింది, ఎలా అవమానించింది అన్న విషయాన్ని వెల్లడించే 11 నిదర్శనాలను పరికిద్దాం.
(1) అంబేద్కర్ జీవితకాలంలో భారతరత్న ఇవ్వలేదు:
భారతదేశ చరిత్రలో మహనీయుల్లో ఒకడు అంబేద్కర్. దేశానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. అయినా ఆయన జీవితకాలంలో భారతరత్న ప్రదానం చేయలేదు. బీజేపీ మద్దతుతో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కార ప్రదానం జరిగింది. స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌కు కూడా భారతరత్న చాలాచాలా ఆలస్యంగా దక్కింది. నాయకులకు గుర్తింపు ఇవ్వడంలో కాంగ్రెస్ అనుసరించే పద్ధతి ఇది.
(2) పార్లమెంటులోనూ ఆలస్యంగా గుర్తింపు:
డాక్టర్ అంబేద్కర్ చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత, 1990ల వరకూ ఆయన చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో పెట్టలేదు. ఆయన చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టింది ఓ కాంగ్రెసేతర ప్రభుత్వమే. అంబేద్కర్ ఘనతను గౌరవించడానికి కాంగ్రెస్‌కు చేతులు రాలేదు.
(3) అంబేద్కర్ జీవితంలోని ప్రధాన స్థలాల పట్ల నిర్లక్ష్యం:
డాక్టర్ అంబేద్కర్ జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రదేశాలను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం మీద కాంగ్రెస్ కనీసం ఆలోచన అయినా చేయలేదు. ఆఖరికి ఆయన పుట్టిన మధ్యప్రదేశ్‌లోని ‘మౌ’ గ్రామాన్నయినా పట్టించుకోలేదు. నరేంద్ర మోదీ హయాంలో మాత్రమే ఆయా స్థలాలను జాతీయ స్మారకాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం మొదలైంది. వాటి చారిత్రక, సాంస్కృతిక ఘనతకు గుర్తింపు లభించింది.
(4) దళిత స్వయంప్రతిపత్తిపై రాజకీయ నిర్బంధం:
దళితులకు ప్రత్యేక ఎలక్టరేట్లు ఉండాలన్న డాక్టర్ అంబేద్కర్ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మహాత్మాగాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఒత్తిడి చేయడంతోనే అంబేద్కర్ పుణే ఒడంబడికను ఒప్పుకోవలసిన నిర్బంధ పరిస్థితి తలెత్తింది. దానివల్ల దళితులకు అంబేద్కర్ ఆశించిన రాజకీయ స్వయంప్రతిపత్తి రాలేదు, దానికి బదులు వారు రిజర్వుడు నియోజకవర్గాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
(5) హిందూ కోడ్ బిల్లుకు వెన్నుపోటు:
వ్యక్తిగత చట్టాలను సంస్కరించి, జెండర్ సమానత్వాన్ని తీసుకురాగల హిందూ కోడ్ బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమాత్రం మద్దతు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయిన అంబేద్కర్, న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసారు. షెడ్యూల్డు కులాలను నిర్లక్ష్యం చేయడం, ఓబీసీ కోటా అమలుకు నిరాకరించడం, అంబేద్కర్‌కు అప్రాధాన్య శాఖను కేటాయించడం వంటి ఇతర కారణాలు కూడా ఆయన రాజీనామాకు దారితీసాయి.
(6) ఎన్నికల్లో వెన్నుపోటు:
ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ క్రియాశీలంగా పనిచేసింది. 1952 లోక్‌సభ ఎన్నికల్లో, 1954 భండారా నియోజకవర్గానికి ఉపయెన్నికలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మీద బలమైన అభ్యర్ధులను నిలబెట్టి, ఆయన తప్పకుండా ఓడిపోయేలా చేసింది. తామే గొప్ప సామాజిక న్యాయ సంస్కర్తలం అని చెప్పుకునే కాంగ్రెస్ గొప్పలు ఉత్త డొల్లలే అని ఈ చర్యలు నిరూపించాయి.
(7) సామాజిక ఉద్యమాలకు మద్దతు లేదు:
మహద్ సత్యాగ్రహం సహా అంటరానితనం, కుల వివక్షలపై డాక్టర్ అంబేద్కర్ చేసిన పోరాటాలు చాలా గొప్పవి. వాటి వేటికీ కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు ఇవ్వలేదు. మహాత్మాగాంధీ వర్ణవ్యవస్థను సమర్ధించేవారు. కులాలను నిర్మూలించాలని అంబేద్కర్ వాదించేవారు. ఆ విభేదాలతో అంబేద్కర్ మరింత దూరమయ్యారు.
(8) బౌద్ధ ఉద్యమానికి వ్యతిరేకత:
దళితుల విముక్తి మార్గంలో ఓ ముందడుగుగా అంబేద్కర్ 1956లో బౌద్ధాన్ని స్వీకరించారు. ఆ చర్యకు కాంగ్రెస్ మద్దతివ్వలేదు. ఆ చారిత్రక ఘట్టం నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. సామాజిక మార్పు కోసం అంబేద్కర్ విప్లవాత్మక చర్య పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది.
(9) నవబౌద్ధులకు రిజర్వేషన్:
అంబేద్కర్ నేతృత్వంలో బౌద్ధాన్ని స్వీకరించి నవబౌద్ధులు అయిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ లబ్ధి 1990లో మాత్రమే లభించింది. ఆ చారిత్రక నిర్ణయం తీసుకున్నది కాంగ్రెసేతర ప్రభుత్వమే. అంబేద్కర్ అనుయాయుల పట్ల కాంగ్రెస్ ఉదాసీనతకు అదొక నిదర్శనం.
(10) అంబేద్కర్ మేధో వారసత్వంపై నిర్లక్ష్యం:
అంబేద్కర్ ఈ దేశానికి చేసిన మేధోపరమైన సేవలను పరిరక్షించి, ప్రచారం చేయడానికి కాంగ్రెస్ నామమాత్రంగా అయినా కృషి చేయలేదు. ఆయన రచనల సమగ్ర సంపుటం ‘రచనావళి’ ప్రచురణ అంబేద్కర్ చనిపోయిన చాలాకాలం తర్వాత, మహారాష్ట్రకు శరద్ పవార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొదలైంది.
(11) రాజ్యాంగ దిన వేడుకలు లేవు:
భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేద్కర్ ఆధునిక భారతాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ కాంగ్రెస్ రాజ్యాంగ దినాన్ని వేడుకగా జరిపేందుకు వ్యవస్థను తయారు చేయలేదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే రాజ్యాంగ దినం అదే రోజున వేడుకలు జరుపుకోవడం మొదలైంది. దేశానికి అంబేద్కర్ సేవలను స్మరించుకోవడంలో అదొక కీలక ఘట్టం.
కాంగ్రెస్ మెరమెచ్చు కబుర్లు:
డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు, ఉద్యమాలు, ఆయన వారసత్వంపై కాంగ్రెస్ చూపిన నిర్లక్ష్యం చారిత్రకం, ఆయనను ఎప్పటికప్పుడు వ్యతిరేకించడం కాంగ్రెస్ చూపిన నైజం. దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు ఆ పార్టీ ఆయన వారసత్వాన్ని తామే స్వీకరించాలని ప్రయత్నిస్తోంది. ఆయనను బతికుండగా ఏనాడూ సత్కరించని, ఆయన రాజకీయ స్వయంప్రతిపత్తిని, సంఘ సంస్కరణ భావాలనూ ఏకపక్షంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ చర్యలు చెప్పేది ఒకటే… అంబేద్కర్ దార్శనికతను కాంగ్రెస్ చర్యలు ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూనే ఉన్నాయి.
గుర్తింపు ఇవ్వడంలో జాప్యం:
కాంగ్రెసేతర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ మద్దతిచ్చిన లేక ఆ పార్టీ నాయకత్వం వహించిన కూటమి డాక్టర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తూ వచ్చాయి. జాతీయ స్మారకాలను అభివృద్ధి చేసే క్రమంలో ఆయనకు మరణానంతరం భారతరత్న అవార్డు ప్రదానం చేయడం గొప్ప విషయం. అంబేద్కర్ రచనలను దేశానికి అందేలా చేసిన ప్రభుత్వాల కృషిని గుర్తించి ముందుతరాలకు తీసుకువెళ్ళాలి.