పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురిని అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో గత రాత్రి చేసిన దాడుల్లో కోక్రఝార్ జిల్లాలో నలుగురు, ఢుబ్రీ జిల్లాలో ఒకరు పట్టుబడ్డారు.
కోక్రఝార్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నూర్ మొహమ్మద్, ముజిబుర్ రెహమాన్, హమీదుల్ ఇస్లాం, అబ్దుల్ కరీమ్ పట్టుబడ్డారు. ఢుబ్రి జిల్లాలో ఇనాముల్ హక్ అరెస్ట్ అయ్యాడు. వారందరికీ జైషే మొహమ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని దాదాపు నిర్ధారణ అయింది.
స్థానిక పోలీసుల సహకారంలో ఎస్టిఎఫ్ బలగాలు చేసిన దాడుల్లో ఈ ఉగ్రవాద అనుమానితులు పట్టుబడ్డారు. ఆపరేషన్ సుదీర్ఘ సమయం సాగిందని పోలీసులు చెప్పారు. ఆపరేషన్ వివరాలను ఎస్టిఎఫ్ అధికారులు వెల్లడించలేదు, కానీ పోలీసు వర్గాలు చెప్పిన సమాచారం మేరకు నిందితులు దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిసింది.
కొద్దిరోజుల క్రితమే, డిసెంబర్ 12న ఎన్ఐఎ సంస్థ అస్సాం గోల్పరా జిల్లాలో దాడులు జరిపి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురిని నిర్బంధించింది. ఆ ఆపరేషన్‌లో ఎన్ఐఏకు అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకరించింది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పాగా వేయడానికి, అక్కడినుంచి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడానికీ జైషే మొహమ్మద్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దాన్ని అడ్డుకోడంలో భాగంగా ఎన్ఐఏ, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు పనిచేస్తున్నాయి.