భారతదేశంలోని వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న కేసులో దోషులుగా గతంలో శిక్ష పడిన మాజీ హోంమంత్రి, బిఎన్‌పి నాయకుడు లుఫొజమాన్ బాబర్, మరో ఐదుగురిని బంగ్లాదేశ్ హైకోర్టు తాజాగా నిర్దోషులుగా వదిలేసింది. అదే కేసుకు సంబంధించి మరో ఆరుగురికి విధించిన మరణ శిక్షను పదేళ్ళ జైలుశిక్షగా మార్చింది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
2014లో చిట్టగాంగ్‌లో 10 ట్రక్కుల నిండా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న కేసులో వారికి గతంలో మరణశిక్ష విధించారు. ఆ కేసులో దోషులు మళ్ళీ అప్పీలు చేసుకున్నారు. తాజా అప్పీళ్ళను బంగ్లాదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇవాళ తీర్పు వెలువరించింది. మరణ శిక్షలను జైలుశిక్షలుగా తగ్గించిన వారిలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా కూడా ఉన్నాడు. పరేష్ ప్రస్తుతం చైనాలో ఉన్నాడు.
ఇది 2004 ఏప్రిల్ 1నాటి కేసు. అప్పుడు చిట్టగాంగ్ యూరియా ఫెర్టిలైజర్ లిమిటెడ్ కంపెనీ జెట్టీ దగ్గర 10 ట్రక్కుల నిండా భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధాలను భారత్‌లోని అస్సాంలో యుద్ధం చేస్తున్న వేర్పాటువాద సంస్థ ఉల్ఫా (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం) కోసం పంపిస్తున్నారు. అప్పట్లో ఉల్ఫా నాయకుడు పరేష్ బారువా ఢాకాలో నివసించేవాడు.
అప్పుడు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 4930 వివిధ రకాల తుపాకులు, 27020 గ్రెనేడ్లు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లు, 2వేల గ్రెనేడ్ లాంచింగ్ ట్యూబ్‌లు, 6392 మ్యాగజైన్లు, 11.40 లక్షల బులెట్లు ఉన్నాయి. దానికి సంబంధించి నమోదైన కేసుల్లో మొత్తం 50మంది నిందితులున్నారు. అప్పట్లో బిఎన్‌పి కూటమి అధికారంలో ఉండేది. అంత పెద్దమొత్తంలో ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతోందంటే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉండే నాయకులు, పైస్థాయి అధికారులు, ఇంటలిజెన్స్ అధికారుల ప్రమేయం లేకుండా జరగదు. అందుకే అప్పటి హోంమంత్రి లుఫోజమాన్ బాబ్ను కూడా నిందితుల్లో చేర్చారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, మిలటరీ అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు, ఆ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఆ కేసులో 14మందికి మరణ శిక్ష విధిస్తూ 2014 జనవరిలో తీర్పు వచ్చింది. ఆ తీర్పుమీద అప్పీలుకు వెళ్ళగా ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది.