ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన డైకిన్ పరిశ్రమ ముందుకొచ్చింది.ఈ ఏడాదిలోనే ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుందని వివరించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీ భాగస్వామ్యంతో శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు తెలిపింది. దాదాపు 75 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్ గా అవతరించనుంది.
ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను ఏపీలో తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు డైకిన్ ఓ ప్రకటనలో వివరించింది.
రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉండనుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోయే ఈ కొత్త యూనిట్ తో కలిపి భారత్ లో మొత్తం మూడు యూనిట్లు ద్వారా కంప్రెసర్లు తయారు చేస్తారు.
ఏటా 2 మిలియన్ కంప్రెసర్లను తయారుచేస్తున్నామని, 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ద్వారా దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని తెలిపింది. భారత మార్కెట్లో ఏసీ విక్రయాల్లో అగ్రగామిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని డైకిన్ కంపెనీ పేర్కొంది.