పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ 2022లో రూపొందించిన ‘టేక్ బ్యాక్ బంగ్లాదేశ్’ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభాన్ని అనువుగా చేసుకుని భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది.
ఈ విషయమై ‘కౌంటర్ టెర్రరిజం’ విభాగానికి చెందిన ఒక అధికారి చెప్పిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
ఐఎస్ఐ 2022లో ‘టేక్‌బ్యాక్ బంగ్లాదేశ్’ అనే కోడ్‌నేమ్‌తో ఒక ఆపరేషన్ ప్రారంభించింది. తొలుత దాన్ని భారీస్థాయిలో అమలు చేయాలనే భావించారు. అయితే పాకిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా పడిపోవడంతో ఆ ఆపరేషన్‌ను పేరుకు మాత్రమే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆపరేషన్‌ను క్రియాశీలంగా మార్చడానికి సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ సంక్షోభంలో చిక్కుకోవడం, మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం అతివాద ముస్లిములకు పూర్తి స్వేచ్ఛనివ్వడం, హిందువులపై దాడులకు అనుమతించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఐఎస్ఐ తమ కార్యకలాపాలను పునరుద్ధరించింది.
‘టేక్ బ్యాక్ బంగ్లాదేశ్’:
1971 యుద్ధం పాకిస్తాన్‌కు ఓటమి మాత్రమే కాదు, పెద్ద అవమానం కూడా. బంగ్లాదేశ్‌ను పూర్తిగా కోల్పోయామని అర్ధం చేసుకున్న పాకిస్తాన్, ఆ దేశంలో ఇస్లామిక్ అతివాదాన్ని వ్యాపింపజేయాలని నిర్ణయించుకుంది. దానికోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో అతివాదులను పోషించింది. వారికి శిక్షణనివ్వడంతో పాటు భారీగా నిధులు కూడా సమకూర్చింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి అస్థిరంగానూ, బలహీనంగానూ ఉంది. ఆ దేశంలో భారత వ్యతిరేక అజెండాను పునరుద్ధరించడానికి ఇంతకు మించిన మంచి తరుణం లేదని ఐఎస్ఐ భావిస్తోంది. ఇస్లామిక్ అతివాదాన్ని వ్యాపింపజేయడానికి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో క్యాంపును ఏర్పాటు చేసింది. అక్కడ మగ, ఆడ అతివాదులకు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ పొందిన వారిని బంగ్లాదేశ్‌కు ఐఎస్ఐ తరలిస్తుంది. వారి లక్ష్యం ఒక్కటే… భారత్‌పై ప్రత్యక్ష దాడులకు పాల్పడడం. అదే సమయంలో అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు చేయాలనే ఏకైక ఉద్దేశంతో బంగ్లాదేశ్‌లో విద్రోహచర్యలకు కూడా ఐఎస్ఐ ప్రణాళికలు రచించింది.
ఐఎస్ఐకి తమ లక్ష్యాన్ని సాధించడానికి ఇదే చాలా అనువైన సమయం. ఢాకాలో స్నేహపూరిత ప్రభుత్వం ఉండడం వారికి లాభదాయకం. యూనుస్ ప్రభుత్వం అతివాదులకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇస్లామాబాద్ పట్ల సానుకూల విదేశాంగ వైఖరిని కనబరుస్తోంది కూడా. సముద్ర మార్గాలను తెరిచి పాకిస్తానీ నౌకలను తమ దేశంలోకి అనుమతించడం ద్వారా బంగ్లాదేశ్ ఒకరకంగా భద్రత విషయంలో రాజీ పడింది. పాకిస్తాన్ ఆ ఓడరేవుల ద్వారా పేలుడు పదార్ధాలు, వివిధ రకాల ఆయుధాలను ఎలాంటి తనిఖీ లేకుండా పంపిస్తుంది. పాకిస్తానీయులకు వీసా నియమాలను కూడా బంగ్లాదేశ్ సరళీకరించింది. వాటి ప్రకారం బంగ్లాదేశ్ నుంచి బైటకు వెళ్ళే పాకిస్తానీ పౌరులకు సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేదు. అంటే ఉగ్రవాదులకు అధికారికంగా ప్రయాణానికి పాస్ ఇచ్చినట్లే. ఆ అంశాలను పాకిస్తానీ ఐఎస్ఐ తమకు అనుకూలంగా వాడుకుంటుంది. సుశిక్షితులైన తమ ఉగ్రవాదులను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా నుంచి భారత్‌లోకి పంపించడానికి ఆ మార్గాలను ఉపయోగించుకుంటుంది.
‘బంగ్లాదేశీ బిహారీలు’:
బంగ్లాదేశ్ విముక్తి తర్వాత ఆ భాగంలో ఎంతోమంది పాకిస్తానీలు చిక్కుకుపోయారు. వారు పాకిస్తాన్‌కు తిరిగి వెళ్ళలేకపోయారు. వారి విషయంలో ఇస్లామాబాద్ ఏమీ చెయ్యలేకపోయింది. అలా ఉండిపోయిన వారిని సాధారణంగా ‘బంగ్లాదేశ్‌లోని బిహారీలు’ అంటారు.
నిజానికి ఆ పాకిస్తానీలు బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టాలని భావించినా, పాక్ వ్యవస్థ వారిని తీసుకువెళ్ళడానికి పెద్దగా శ్రమించలేదు. వారికి బంగ్లాదేశ్ పౌరసత్వం ఆశ చూపించినా తీసుకోలేదు, తమను పాకిస్తాన్ వెనక్కు తీసుకుని వెళ్ళిపోతుందని భావించారు. బంగ్లాదేశ్ విముక్తి తర్వాత అలాంటి సైనికులు 66 క్యాంపుల్లో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని 13 జిల్లాల్లో వ్యాపించి ఉన్నారు.
వాళ్ళలో అత్యధికులు బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వలస వెళ్ళిన కూలీలు కాబట్టి వారిని బిహారీలు అనేవారు. ఆ ఉర్దూ మాట్లాడే కూలీలు 1947 దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. అప్పటినుంచీ వారు తమను పాకిస్తాన్ పౌరులుగానే భావించుకుంటూ ఉంటారు. పాకిస్తాన్ సైన్యానికి తొత్తులుగా మాత్రమే పరిగణిస్తారు. దాంతో వారి జీవితాలే మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో బెంగాలీల మీద దాడులకు పాల్పడింది వారే. పాకిస్తాన్ మొదలుపెట్టిన ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ను అమలుచేసే నేరస్తులు వారే. అప్పటినుంచీ వారిని వెలి వేయబడిన వారిగానూ, బంగ్లాదేశ్‌కు శత్రువులుగానూ పరిగణించేవారు.
బంగ్లాదేశీ బిహారీలపై పాక్ శీతకన్ను:
ఈ బంగ్లాదేశీ బిహారీలు, పాకిస్తాన్‌తో వారి సంబంధాల కారణంగా, బంగ్లాదేశ్‌లో నామమాత్రంగా మిగిలిపోయారు. వారిపై బంగ్లాదేశీయులు పాల్పడే అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వారు ఇప్పుడు ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో ఉన్నారు. నిజానికి ఆ ప్రజలను పాకిస్తాన్ వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నో ఇస్లామిక్ దేశాలు గుర్తు చేసాయి. కానీ ఆ కోణంలో పాకిస్తాన్ ఏమీ చేయలేదు.
ఈ బంగ్లాదేశీ బిహారీలను వెనక్కు తీసుకువెళ్ళడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. దానికి తగినన్ని నిధులు లేవంటే ప్రపంచ ముస్లిం దేశాల సమాఖ్య ఆర్థిక సహాయం చేసింది. ఐనా పాకిస్తాన్ వారి పేరును వాడుకుంది తప్ప తమకు విధేయంగా ఉన్న బంగ్లాదేశీయులకు ఏమీ చేయలేదు.
ఐతే ఐఎస్ఐకి విధేయత పట్ల పట్టింపు లేదు. అక్కడ బిహారీలను మనుషులుగా కాక ఆస్తిగా పరిగణిస్తారు. పాకిస్తాన్ ఇన్నాళ్ళూ ఆడిన జూదం ఇప్పుడు ఫలితాలనిస్తోంది. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్‌లలో ఇస్లామిక్ అతివాదాన్ని వ్యాపింపజేయడానికి… ఇరుదేశాల్లోనూ ఉగ్రదాడులు చేయడానికీ… పాకిస్తాన్ ఈ బిహారీలను వాడుకుంటోంది. అందుకే, ఈ బంగ్లాదేశీ బిహారీలు ఎన్నిసార్లు తమను స్వదేశానికి తీసుకుపోవాలని కోరినా పాక్ పట్టించుకోలేదు.
గతంలో కూడా ఈ జనాలను బంగ్లాదేశ్‌లో క్రూరమైన పనులకు వాడుకునేవారు. వాళ్ళు బంగ్లాదేశీయుల్లో కలవరు కాబట్టి వాళ్ళని దేశంలో మైనారిటీలపై దాడులకు లక్ష్యంగా మార్చారు. ఆ పని గతంలోనూ చిన్నస్థాయిలో జరిగేది, కానీ ఇప్పుడు మైనారిటీల మీదా, భారతదేశం మీదా పూర్తిస్థాయి యుద్ధానికి వారిని వాడుకోవాలని ఐఎస్ఐ భావిస్తోంది.
బంగ్లాదేశీ బిహారీల నమ్మకంతో పాక్ ఆటలు:
తమను ఎప్పటికైనా పాకిస్తాన్‌లోకి రానిస్తారనే ఆశతో ఈ బంగ్లాదేశీ బిహారీలు ఐఎస్ఐ ఆదేశించే పనులు మాత్రమే చేస్తారు. వారు చాలాకాలంగా తమకొక దేశం లేని బలహీనమైన వర్గంగా మిగిలిపోయారు. వారి జీవన ప్రమాణాలు చాలా చెడ్డగా ఉన్నాయి. వాళ్ళ క్యాంపుల్లో సరైన వసతులే లేవు. వాళ్ళ ఆశలన్నీ పాకిస్తాన్‌లో మెరుగైన జీవితం కోసం… ఐఎస్ఐ నుంచి వచ్చే ఆదేశాలను కచ్చితంగా ఆచరించడం కోసమే.
బంగ్లాదేశ్ తమకు పౌరసత్వం ఇస్తామంటున్నా వద్దంటూ దుర్భరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నది ఎప్పటికైనా పాకిస్తాన్‌కు వెళ్ళకపోతామా అనే. వారి కోరిక ఎప్పటికీ తీరదనే విషయాన్ని వారు గ్రహించడం లేదు. అంతేకాదు, భారతదేశంపైనా, హిందువులపైనా వారి విపరీతమైన గుడ్డి ద్వేషమే, వారిని ఐఎస్ఐను నమ్మేలా చేస్తోంది. ఆ వెర్రి జనాలను ఐఎస్ఐ ఇప్పుడు విపరీతంగా వాడుకుంటుంది. కానీ చివరికి ఈ బంగ్లాదేశీ బిహారీల తలరాతలు అదే బంగ్లాదేశ్‌లోని ఇరుకు మురికి క్యాంపుల్లోనే రాసిపెట్టి ఉన్నాయి.