వక్ఫ్ సవరణ బిల్లు 2024 మీద ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఆల్ ఇండియా షియా పెర్సనల్ లా బోర్డ్ (ఏఐఎస్పీఎల్బీ) సభ్యులతో సమావేశమవుతుంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో జరగబోయే ఆ సమావేశంలో వక్ఫ్ చట్టం సవరణల మీద షియా పీఎల్బీ అభిప్రాయాలను తెలుసుకుంటుంది.
వక్ఫ్ సవరణ బిల్లును దారుల్ ఉలూమ్ దేవబంద్ తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ ప్రతినిధులు డిసెంబర్ 11న జేపీసీతో భేటీ అయ్యారు. మౌలానా అర్షద్ మదానీ నేతృత్వంలోని దారుల్ ఉలూమ్ ప్రతినిధుల బృందం ఆ సమావేశంలో జేపీసీతో రెండు గంటల పాటు చర్చలు జరిపింది. ‘‘ఆ సవరణలు అమల్లోకి వస్తే ముస్లిముల ప్రార్థనా ప్రదేశాల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది’’ అని మౌలానా మదానీ హెచ్చరించాడు.
జేపీసీ గడువు పెంచిన తర్వాత ఆ కమిటీ మొదటిసారి దారుల్ ఉలూమ్ దేవబంద్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వక్ఫ్ సవరణ బిల్లును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పడానికి దారుల్ ఉలూమ్ దేవబంద్ ప్రతినిధులు 22 అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ప్రధానంగా చారిత్రకంగా, మతపరంగా ప్రధానమైన కట్టడాలపై తీవ్రప్రభావం చూపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు.
‘‘భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా పురాతనమైన మసీదులు, ఇతర ప్రార్థనాస్థలాలూ ఉన్నాయి. ఇప్పుడు వాటి అసలైన దాతలను కనుగొనడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్న సవరణల్లో గణనీయమైన లోపాలున్నాయి. వాటి వెనుక ఉద్దేశాల మీద అనుమానాలు కలుగుతున్నాయి’’ అని మౌలానా మదానీ జేపీసీ ముందు తమ వాదన వినిపించాడు.
వక్ఫ్ సవరణ బిల్లు మీద ఏర్పాటు చేసిన జేపీసీ కాలావధిని ఇటీవల లోక్‌సభ పొడిగించింది. జేపీసీ తమ నివేదికను 2025 బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వానికి సమర్పించాలంటూ గడువు విధించింది. జేపీసీ చీఫ్ అయిన జగదాంబికా పాల్ డిసెంబర్ 5న తమ కమిటీ పనితీరు గురించి చెప్పారు. గడువు పొడిగించడానికి ముందు కమిటీ 27 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.