కర్ణాటకలోని హళక్కి గిరిజన తెగవారు ప్రేమగా వృక్షదేవత అని గౌరవించుకునే, కన్నడిగులు అడవులపై విజ్ఞాన సర్వస్వం అని పిలుచుకునే ప్రఖ్యాత పర్యావరణవేత్త పద్మశ్రీ తులసి గౌడ. సోమవారం సాయంత్రం ఆమె తన స్వగ్రామం హొన్నాళిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ నాయకులందరూ ఆమెకు నివాళులర్పించారు. తులసి గౌడ మరణంతో మానవత్వం, ప్రకృతి అల్లిబిల్లిగా అల్లుకున్న గొప్ప ప్రయాణం ఒక ముగింపుకు వచ్చింది.
తులసి గౌడ 1944లో హళక్కి గిరిజన తెగలో జన్మించింది. ఆమె బాల్యం కష్టాల్లో గడిచింది. రెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయింది. చదువుకోడానికి అవకాశం లేదు. అలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ పెరిగిందామె. అయినప్పటికీ ప్రకృతితో అనుబంధం ఉండడం వల్లనే ఆమె సొంతంగా అడవుల గురించిన జ్ఞానాన్ని సంపాదించింది. చిన్నతనం నుంచీ తన తల్లితో కలిసి రోజుకూలీగా కర్ణాటక అడవుల్లో పనిచేసేది. హళక్కి ఒక్కళిగ తెగకు చెందిన సంప్రదాయాలు మాతృస్వామ్య నియమాలను అనుసరించి ఉండేవి కావడంతో ప్రకృతిని గౌరవించడం, ప్రేమించడం తులసికి జన్మతః అబ్బింది. ఏ జాతికి చెందినదైనా తల్లి చెట్టును గుర్తించే విద్య ఆమె సొంతమైంది. ఒక చెట్టును చూసి దాని వయసెంత, దాని పరిమాణమెంత, అది భూగర్భంలో ఎంత పాతుకుపోయి ఉంది, తన జాతి మొక్కలకు జీవింపజేయగల పోషకాలను బదిలీ చేసే భూగర్భ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసింది… వంటి విషయాలను తులసి సులువుగా గుర్తించగలదు. అందుకే ఆమెను ‘వృక్ష దేవత’ అని అభిమానంగా పిలుచుకునేవారు.
విత్తనాల సేకరణలో నిపుణత, తల్లి చెట్ల నుంచి విత్తనాలను జాగ్రత్తగా సేకరించడంలో నైపుణ్యం కారణంగా తులసి కర్ణాటక అడవుల్లో అంతరించిపోతున్న దశకు చేరుకున్న పలు వృక్షజాతులను మళ్ళీ పుట్టించి, పెంచగలిగింది. ఆమె ప్రయత్నాల వల్ల అడవులు మాత్రమే పెరగలేదు… టైగర్ రిజర్వులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, పరిరక్షణ ప్రదేశాలూ బలోపేతమయ్యాయి.
తులసి గౌడ సేవలను గుర్తించిన కర్ణాటక అటవీశాఖ ఆమెకు 35ఏళ్ళ వయసులో తమ శాఖలో శాశ్వత సభ్యురాలిగా గుర్తింపు ఇచ్చింది. ఆరు దశాబ్దాలకు పైబడిన ఉద్యోగ జీవితంలో ఆమె సుమారు లక్ష చెట్లను పెంచి పోషించింది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా క్రమక్షయం చెందిన భూములను పునరుజ్జీవింపజేసింది.
తులసి కృషి మొక్కలు నాటడంతోనే అయిపోలేదు. విత్తన సేకరణ, పరిరక్షణలో అపారమైన అనుభవంతో తులసి ఎన్నో అంతరించిపోతున్న వృక్షజాతులను పునరుద్ధరించింది. తులసి సేవల వల్ల కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఒక కమ్యూనిటీ రిజర్వు, ఐదు టైగర్ రిజర్వులు, పదిహేను కన్జర్వేషన్ రిజర్వులు, ముప్ఫై వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలూ బలోపేతమయ్యాయి.
తులసి గౌడ తన అనుభవజ్ఞానంతో అడవుల్లో రేగే దావానలాలను నిలువరించింది. జంతువుల అక్రమ వేటను అరికట్టగలిగింది, వన్యప్రాణుల జీవావరణాలను పునరుద్ధరించింది. తన గిరిజన సంప్రదాయం నుంచి అలవడిన జ్ఞానాన్ని ఆధునిక పరిరక్షణ పద్ధతులనూ మేళవించి, అడవుల పరిరక్షణ కోసం కర్ణాటక అటవీ విభాగానికి తులసి గౌడ సుస్థిర వ్యూహాలను అందించింది. అవి ప్రకృతికి, పర్యావరణానికే కాదు, స్థానిక ప్రజలకు సైతం లాభం చేకూర్చాయి. తులసి ప్రయత్నాల వల్ల గిరిజన, గ్రామీణ వాసులకు సుస్థిర జీవనోపాధి, విద్యావకాశాలూ లభించాయి. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సమాజ సంక్షేమం కలిసి పనిచేయగలవని ఆమె నిరూపించింది.
తులసి గౌడను ‘అడవులకు సంబంధించి నడిచే విజ్ఞాన సర్వస్వం’గా గౌరవిస్తారు. వైవిధ్యభరితమైన మొక్కల జాతుల గురించి, వాటి ఔషధ విలువల గురించి, పర్యావరణాన్ని నిలబెట్టడంలో అవి పోషించే పాత్ర గురించీ తులసికి ఉన్న జ్ఞానం అనంతం. తల్లిచెట్లను గుర్తించి వాటినుంచి విత్తనాలను సేకరించడంలో తులసి సామర్థ్యమే, ఎన్నో అడవులను పునరుజ్జీవింపజేయడంలో ఆమెకు విజయాలను సాధించిపెట్టింది. ఆమె ప్రతీ చెట్టునూ ఒక ప్రాణమున్న జీవిలాగే చూసేది. వాటికి ప్రేమ గౌరవం ఆదరం అభిమానం అందించాలని చెప్పేది.
తులసి గిరిజన జ్ఞానం పర్యావరణ పరిరక్షణలో సమగ్రమైన విధానాన్ని క్రోడీకరించేలా చేసింది. అన్ని జీవరాశుల మధ్యా ఉండే పరస్పర సంబంధాన్ని గౌరవించడం ద్వారా తులసి, సమకాలీన పర్యావరణ సవాళ్ళను సంప్రదాయ విధానాలు ఎలా పరిష్కరించగలవో ఆచరించి చూపించింది.
కర్ణాటకలోని మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన తులసి గౌడ పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషి ఆమెకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2021లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసారు. ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర వంటి ప్రఖ్యాత పురస్కారాలెన్నో ఆమెను వరించి తమ విలువ పెంచుకున్నాయి.
తులసి గౌడ కృషి కేవలం పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నం మాత్రమే కాదు. ప్రకృతి పట్ల ప్రేమ ఆదరం అభిమానం చూపించే తాత్వికత అది. మానవ మనస్తత్వాన్ని, సమాజ అవసరాలను, పర్యావరణ సుస్థిరత ఆవశ్యకతనూ ఆమె అర్ధం చేసుకుని నిర్మించిన హరిత ఉద్యమం యావత్ భారతావనికే స్ఫూర్తిదాయకం.