బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ డ్రా ముగిసింది.
రెండో సెషన్ లో భారత్ ఎదుట 275 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన భారత్ కు వరుణదేవుడు సహకరించాడు. భారత్ 8 పరుగులు చేయగానే చిరుజల్లులు ప్రారంభం అయ్యాయి. దీంతో అంపైర్లు ఆటను కొంతసేపు నిలిపివేశారు. వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు.
ఐదు టెస్టుల సిరీస్‌లో చెరొక విజయంతో భారత్, ఆసీస్ సమంగా ఉన్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్(బాక్సింగ్ టెస్ట్) మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 117.1 ఓవర్లు ఆడి 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 260 పరుగులు చేసింది. అది కూడా టాయిలెండర్ల పోరాటం కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ 18 ఓవర్లు ఆడి 7 వికెట్లు నష్టపోయి 89 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచి డిక్లేర్ చేసింది.
ఛేదనలో భారత్ 8 పరుగులు చేయగానే వర్షం పడి మ్యాచ్ రద్దు అయింది. వాన తెరిపి ఇవ్వకపోవడంతో మ్యాచ్ ను డ్రా గా ముగించినట్లు అంపైర్లు ప్రకటించారు.