కర్ణాటక సంగీత గాయకుడు టిఎం కృష్ణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహాగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట ఏర్పాటు చేసిన అవార్డు గ్రహీతగా ఆయనను గుర్తించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. కృష్ణ సైతం తనను ‘సంగీతకళానిధి ఎంఎస్ సుబ్బులక్ష్మి పురస్కార గ్రహీత’ అని చెప్పుకోకూడదని స్పష్టం చేసింది.
జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్.వి.ఎ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నాడు ఆమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకు సుబ్బులక్ష్మి పేరిట పెట్టిన సంగీతకళానిధి పురస్కారం ఇవ్వవచ్చునంటూ మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మనవడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హిందూ ప్రచురణ సంస్థ ప్రాయోజకత్వంలో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఇచ్చే సంగీతకళానిధి ఎంఎస్‌సుబ్బులక్ష్మి పురస్కారానికి ఈ యేడాది టిఎం కృష్ణను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది.
‘‘ఎంఎస్ సుబ్బులక్ష్మికి అన్నివర్గాల్లోనూ ఉన్న ఆదరాభిమానాల గురించి సుప్రీంకోర్టుకు గౌరవం ఉంది. దేశం గర్వించదగిన అద్భుతమైన గాయకులలో ఎమ్మెస్ ఎన్నదగినవారు. 2004 డిసెంబర్‌లో ఆమె తుదిశ్వాస విడిచినా, నేటికీ ఆమె గాత్రమాధుర్యం అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె గురించి టిఎం కృష్ణ చేసిన వ్యాఖ్యలు, రాసిన రాతలు అతని తరహాలో ఆమెపట్ల గౌరవాన్ని వ్యక్తీకరించాయి. అయితే ఆమె పట్ల టిఎం కృష్ణ ఉపయోగించిన పదాలు సముచితంగా లేవని ఫిర్యాదిదారు అభిప్రాయపడుతున్నారు’’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
‘‘ఈ అవార్డును డిసెంబర్ 15న ప్రదానం చేసేసారు. కాబట్టి ఇప్పుడు చేయదగినది ఒకటే. టిఎం కృష్ణను సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించకూడదు, ఆయన తన గురించి తాను ఆ అవార్డు గ్రహీతగా చెప్పుకోకూడదు’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
టిఎం కృష్ణకు వ్యతిరేకంగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మనవడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసారు. ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి టిఎం కృష్ణ దుష్టబుద్ధితో నీచమైన వ్యాఖ్యలు చేసాడు, సామాజిక మాధ్యమాల్లో ఆమెను దూషించాడు, ఆమె పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించాడు’ అన్నది ఆయన ఆరోపణ. తన మామ్మ గౌరవార్థం ఆమె పేరిట పెట్టిన పురస్కారాన్ని, ఆమె సంగీత ప్రతిభను, పరంపరనూ అవమానించిన వ్యక్తికి ఇవ్వకూడదని ఆయన వాదన.
ఎమ్మెస్ మనవడు శ్రీనివాసన్ మొదట మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసారు. కానీ కృష్ణకు అవార్డు ఇవ్వకుండా మ్యూజిక్ అకాడెమీని నిలువరించాలన్న వాదనను మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 13న కొట్టిపడేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 15న నిశ్చయించారు. అయితే శ్రీనివాసన్ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా పరిశీలించడానికి, తక్షణమే జోక్యం చేసుకోడానికీ సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘అవసరమైతే అవార్డును రీకాల్ చేయగలం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఈ విషయంలో తమ జవాబులు నాలుగు వారాలలోగా ఇవ్వవలసిందిగా టిఎం కృష్ణకు, మ్యూజిక్ అకాడెమీకి, హిందూ ప్రచురణ సంస్థకు నోటీసులు పంపించింది.