ప్రతికూల వాతావరణంతో మ్యాచ్‌కు తరుచూ అంతరాయం
ఆసీస్, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న గబ్బా టెస్ట్ ఆఖరి రోజుకు చేరుకుంది. కాకపోతే ఈ టెస్ట్ లో ఇరుజట్లపై వరుణుడే పై చేయి సాధించేలా ఉన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టుకు 185 పరుగుల లీడ్ లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 252/9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్, మరో 8 పరుగులు జోడించి ఆఖరి వికెట్ నష్టపోయింది.
బుమ్రా (10), ఆకాశ్ దీప్ (31) ద్వయం క్లిష్టకాలంలో 47 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును ఫాలో ఆన్ నుంచి తప్పించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్, ట్రావిస్ హెడ్ తలా ఒక వికెట్ తీశారు.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఏడు వికెట్లు నష్టపోయి 89 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లోని 185 పరుగులతో కలిపి 274 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో పాట్ కమిన్స్ (22) టాప్ స్కోరర్. ఆసీసీ 18 ఓవర్లలో ఆడి ఆటను డిక్లేర్ చేసింది.
భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, సిరాజ్ , ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్, 275 పరుగుల లక్ష్యంతో క్రీజులో అడుగుపెట్టింది. కేఎల్ రాహుల్, జైశ్వాల్ 2.1 ఓవర్లు ఆడగానే వరుణుడు మ్యాచ్ కు అంతరాయం కల్పించాడు. దీంతో టీ బ్రేక్ ను అంపైర్లు ముందుగానే ప్రకటించారు.