బిహార్ నుంచి వచ్చిన ఇద్దరు వలస కూలీల హత్య మణిపూర్‌ను మరోసారి అల్లకల్లోలం చేసేందుకు పన్నిన పెద్ద కుట్రలో భాగమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ అన్నారు. నవంబర్ 14న జరిగిన వలస కూలీల హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఆ ఉగ్రవాద చర్య మా విలువల మీద జరిగిన ప్రత్యక్ష దాడి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అన్నారు.
బిహార్ నుంచి పని కోసం మణిపూర్‌లోని కాక్చింగ్ జిల్లాకు వెళ్ళిన సునాలాల్ కుమార్ (18), దశరత్ కుమార్ (17) తాము పనిచేసే కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఇంటికి వెడుతుండగా హత్యకు గురయ్యారు. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ కీలకమైన సమయంలో ఇలాంటి దారుణమైన నేరం జరగడం, మా రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రలో భాగం అయి ఉండే అవకాశాన్ని విస్మరించలేము. రాష్ట్రాన్ని మరింత అల్లకల్లోలం చేసి, మరింత అరాచకంలోకి నెట్టేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అలాంటి విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా ఉండాలి. భయాన్ని, అభద్రతనూ కలిగించాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని విజయవంతం కానీయకూడదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు మణిపూర్ ప్రభుత్వం చెరో రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.
కెయిరక్ గ్రామం దగ్గర ఇద్దరు బిహారీ వలసకూలీలను హత్య చేసిన వారిని పట్టుకోడం కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో నిన్న సోమవారం నాడు కాక్చింగ్ లమ్ఖాయ్ ప్రాంతంలో కెసిపి (పిడబ్ల్యుజి) సంస్థకు చెందిన మిలిటెంట్ ఇరెంగ్బామ్ రామేశ్వర్ సింగ్ (48)ని పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో కాక్చింగ్ మమాంగ్ చింగ్ లైఫామ్ లొక్నుంగ్ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఏడుగురు మిలిటెంట్లను బంధించారు.
అతివాదుల నుంచి భద్రతా బలగాలు ఒక 7.65 పిస్టల్, మ్యాగజైన్, 9ఎంఎం నాటు తుపాకీ, మ్యాగజైన్, 0.32 పిస్టల్, మ్యాగజైన్, 7.62 దేశవాళీ స్నైపర్ రైఫిల్, మ్యాగజైన్, రెండు డీబీబీఎల్ గన్స్, రెండు ఎస్బీబీఎల్ గన్స్, మూడు గ్రెనేడ్లు, ఒక డెటొనేటర్, 19 లైవ్ రౌండ్ ఆమ్యునిషన్స్ స్వాధీనం చేసుకున్నాయి.