ఉత్తరప్రదేశ్‌లోని శంబల (సంభల్)లో 1978 నుంచీ మూసివేసిన శివహనుమాన్ మందిరాన్ని మూడురోజుల క్రితం అంటే డిసెంబర్ 14న మళ్ళీ తెరిచిన సంగతి తెలిసిందే. ఆ మందిరంలో తాజాగా పూజాది కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇవాళ పొద్దున్న ఉదయ హారతి పూజలు జరిగాయి.
గుడి దగ్గర భద్రత ఏర్పాటు చేసారు. నిన్న ఆలయం ఆవరణ అంతటినీ శుభ్రపరిచారు. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించారు, ఆలయ రక్షణ కోసం సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసారు.
ఈ ఆలయం 46ఏళ్ళుగా మూతపడి ఉందని ‘నగర హిందూ సభ’ కార్యకర్త విష్ణు శరణ్ రస్తోగీ నిర్ధారించారు. అక్కడే ఉండి పూజాదికాలు నిర్వహించే పండితుడు లేకపోవడం వల్ల దేవాలయం 1978 తర్వాత మూతపడిపోయిందని ఆయన చెప్పారు. స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసులు కలిసి చేపట్టిన ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లో ఈ ఆలయం వెలుగు చూసింది.
ఆలయ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా పక్కనున్న బావిని పరిశీలించినప్పుడు అందులో మూడు విగ్రహ మూర్తులు లభించాయి. వాటిలో రెండు వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు. వాటిని ఆలయ ఆవరణలో జాగ్రత్త చేసారు.
సంభల్‌లో ఆక్రమణలను తొలగించే ఆపరేషన్‌లో భాగంగా ప్రధానంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే దృష్టి సారించామని సబ్‌కలెక్టర్ వందనా మిశ్రా చెప్పారు. ఇప్పుడు ఆచూకీ తెలిసిన శివ-హనుమాన్ ఆలయానికి పూర్వవైభవం సంతరింపజేస్తామని ప్రకటించారు.
ఈ గుడి గురించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న సోమవారం నాడు రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించారు. అత్యంత పురాతనమైన శివ-హనుమాన్ మందిరాన్ని తెరవనీయకుండా నాలుగు దశాబ్దాల పాటు అడ్డుకున్న సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.