వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం నవంబరు మాసంలో ఎగుమతులు 32 బిలియన్ డాలర్లు ఉండగా, దిగుమతులు మాత్రం 69 బిలియన్ డాలర్లను దాటిపోయింది. అంటే ఒక్క నెలలోనే వాణిజ్య లోటు 37 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది జీవితకాల గరిష్ఠం కావడం విశేషం. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా నవంబరులో బంగారం దిగుమతులు 49 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు రికార్డులను నమోదు చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబరు చివరి వరకు ఎగుమతులు 284 బిలియన్ డాలర్లు ఉండగా, దిగుమతులు 486 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఎనిమిది నెలల్లో వాణిజ్య లోటు 202 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూ.16 లక్షల కోట్ల లోటు ఏర్పడింది. పెట్రోల్ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించడం, బంగారం దిగుమతులు భారీగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.నవంబరు ఒక్క నెలలోనే సేవలరంగం ఎగుమతులు 35 బిలియన్ డాలర్లను దాటింది. ఇది కొంచె ఊరట నిచ్చే అంశం. జీవితకాల గరిష్ఠం కూడా.
బంగారం దిగుమతులు ఏప్రిల్ నుంచి నవంబరు కాలంలో 49 బిలియన్ డాలర్లకు పెరిగాయి.2024లో బంగారం ధర 25 శాతం పెరిగింది. ఇంకా పసిడి ధర పెరుగుతుందనే అంచనాలతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసింది.