కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా వాద్రా పార్లమెంటుకు సోమవారం నాడు ‘పాలస్తీనా’ ట్యాగ్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్ ధరించి రావడం వివాదాస్పదమైంది. అధికార బీజేపీ నేతలు ఆమెను నిందించగా, స్వపక్షం కాంగ్రెస్ తమ నాయకురాలిని సమర్ధించుకుంది.
‘‘గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యుల మానసిక స్థితి ఒకటే. విదేశీ ఆలోచన, విదేశీ ముఖం’’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ వ్యాఖ్యానించారు.
‘‘ప్రియాంక పాలస్తీనా బ్యాగ్ బదులు భారత్ బ్యాగ్ తెచ్చి ఉండాల్సింది. సంబంధం లేని విషయాలను తీసుకురావడం ద్వారా ఆమె డ్రామాకు తెరతీసింది’’ అని కేంద్ర సహాయమంత్రి బన్వరీలాల్ వర్మ స్పందించారు.
‘‘ప్రియాంక హ్యాండ్‌బ్యాగ్ మీద పాలస్తీనా అని రాసి ఉంది. ఆమెకు భారత్‌తో సంబంధం లేదని మనం అర్ధం చేసుకోవాలి. కొద్దిరోజుల క్రితం ఆమె బ్యాగ్ మీద ఇటలీ అని రాసి ఉండేది ఇప్పుడు పాలస్తీనా వంతు. ఇంక ఆమె హ్యాండ్‌బ్యాగ్ మీద భారత్ వంతు ఎప్పుడు వస్తుందో…’’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు.
‘‘కాంగ్రెస్, దాని నాయకులు రాహుల్, ప్రియాంకల డిక్షనరీలో ప్రజాస్వామ్యం, వ్యవస్థ అనే పదాలు లేనేలేవు. మన దేశం చాలా విస్తారమైనది. దాని ప్రజాస్వామ్యం చరిత్ర చాలా గొప్పది. కానీ వారి మానసిక స్థితి చాలా ప్రశ్నలకు దారితీస్తోంది’’ అని బీజేపీ ఎంపీ కమల్‌జీత్ సెహ్రావత్ అన్నారు.
‘‘జనాలు వార్తల కోసం అలాంటి పనులు చేస్తారు. ప్రజలు తిరస్కరించినప్పుడు వారు అలాంటి నటనలకు పాల్పడుతుంటారు’’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ గులామ్ అలీ ఖతానా వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్న సంగతిని ఆమె నిరూపించాలి అనుకున్నారు. వాళ్ళకు బంగ్లాదేశ్‌లో బాధితుల బాధ కనబడదు, పాలస్తీనా మాత్రమే కనిపిస్తుంది. ఆమె 20సార్లకు పైగా గాజా గురించి ట్వీట్ చేసింది, కానీ బంగ్లాదేశీ హిందువుల గురించి ఒక్కసారైనా నోరెత్తలేదు. కాంగ్రెస్ అనేది ముస్లింలను బుజ్జగించే పార్టీ’’ అని బీజేపీ అధికార ప్రతినిథి ప్రదీప్ భండారీ మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకురాలిని సమర్థించుకు వచ్చేసాడు. ‘‘పాలస్తీనాలో చిన్నపిల్లలను చంపేస్తున్నారు. ఆస్పత్రులపై బాంబులు వేస్తున్నారు. అలాంటి చర్యలకు ఆమె మానవత్వంతో నిరసన తెలియజేస్తున్నారు’’ అన్నాడు.