తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ చెంగయ్యను ఉద్యోగం నుంచి తీసేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. క్రైస్తవుడైన చెంగయ్య మోసపూరితంగా ఎస్సీ సర్టిఫికెట్తో ప్రభుత్వోద్యోగం సంపాదించారని ఎల్ఆర్పిఎఫ్ వివరించింది.
నిన్న సోమవారం గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో ఎల్ఆర్పిఎఫ్, డాక్టర్ చెంగయ్యపై మహిళలను వేధించిన ఆరోపణలు, ఎస్వీయూలో క్రైస్తవ మత ప్రచారం చేసిన దాఖలాలూ ఉన్న సంగతిని ప్రస్తావించింది. ఆ ఫిర్యాదు కాపీని విశ్వవిద్యాలయం అధికారులకు కూడా పంపించింది.
ఎల్ఆర్పిఎఫ్ ఫిర్యాదులో… డాక్టర్ చెంగయ్య క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఎస్సీలకు అమలయ్యే రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఆయన చట్టవిరుద్ధంగా ఎస్సీ సర్టిఫికెట్ పొందారు. అది భారత రాజ్యాంగం జారీ చేసిన షెడ్యూల్డు కులాల ఉత్తర్వు 1950కి విరుద్ధం. ఆ ఉత్తర్వు ప్రకారం హిందూ మతం కాకుండా వేరొక మతాన్ని అనుసరించేవారు ఎస్సీ హోదాను పొందలేరు.
డాక్టర్ చెంగయ్య మీద ఆరోపణలు రావడంతో ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై హైపవర్ కమిటీ విచారణ జరిపింది. ఆ కమిటీలో విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్‌తో పాటు యూనివర్సిటీ ప్రిన్సిపాళ్ళు, వైస్ ప్రిన్సిపాళ్ళు సభ్యులుగా ఉన్నారు. ఆ హైపవర్ కమిటీ చెంగయ్యపై వచ్చిన ఆరోపణలను విచారించి అవి నిజమేనని తేల్చుకుంది. ఫలితంగా చెంగయ్యను డిపార్ట్మెంట్ హెడ్ బాధ్యతల నుంచి తొలగించారు. డీన్(ఎస్‌సిడిసి) గా ఉన్న అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించారు. చెంగయ్య తన అధికారం మాటున తరగతి గదిలో క్రైస్తవ మతప్రచారం చేస్తున్నారని నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించింది. విచారణ సమయంలో డాక్టర్ చెంగయ్య తాను క్రైస్తవుడననీ, విద్యార్ధుల్లో క్రైస్తవ మతప్రచారం చేసాననీ ఒప్పుకున్నారు.
ప్రొఫెసర్ చెంగయ్యను తక్షణం విధుల నుంచి డిస్మిస్ చేయాలని ఎల్ఆర్పిఎఫ్ డిమాండ్ చేసింది. ఆయన చర్యలు రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే అని, చెంగయ్యకు ఉద్యోగం ఇవ్వడం నిజమైన ఎస్సీలకు తీరని అన్యాయం చేయడమేననీ ఎల్ఆర్పిఎఫ్ వివరించింది. అలాంటి చర్యలు మోసం కిందికే వస్తాయని, రిజర్వేషన్ల ప్రయోజనాన్నే దెబ్బతీస్తాయనీ ధ్రువీకరిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే ఒక తీర్పు ఇచ్చిన సంగతిని కూడా ఎల్ఆర్పిఎఫ్ తన ఫిర్యాదులో ప్రస్తావించింది.
‘‘డాక్టర్ చెంగయ్య ప్రభుత్వోద్యోగం సాధించడానికి ఎస్సీ సర్టిఫికెట్‌ను మోసపూరితంగా ఉపయోగించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. నిజంగా ఎస్సీకులాలకు చెందిన వారికి అన్యాయం చేయడమే. అటువంటి చర్యలకు శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. చెంగయ్యపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆయనను ఉద్యోగం నుంచి తీసివేయాలి’’ అంటూ ఎల్ఆర్పిఎఫ్ తమ ప్రకటనలో పేర్కొంది.
‘‘తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయమున్న ఆ ప్రదేశం మీద చర్చ్, దాని ఎకోసిస్టమ్ నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. వీధుల్లో మతప్రచారం, ఇళ్ళలో చర్చ్‌లు, టిటిడిలో క్రైస్తవ ఉద్యోగులు… ఇలా తిరుపతిలో హిందుత్వాన్ని దెబ్బతీయడానికి క్రైస్తవులు చేయని ప్రయత్నం అంటూ లేదు. తిరుపతి, తిరుమలలో హిందుత్వాన్ని నాశనం చేయడమే ఎజెండాగా చర్చ్ పనిచేస్తోంది’’ అని ఎల్ఆర్పిఎఫ్ అధ్యక్షుడు ఎఎస్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటి చర్యలనుంచి తిరుపతి, తిరుమలను రక్షించుకోవడం హిందువులందరి కర్తవ్యమని అభిప్రాయపడ్డారు.