ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరతమిళనాడులో తీరందాటే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడుతోపాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి శనివారం వరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, ఉత్తరకోస్తా, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో 3 నుంచి 20 మి.మీ వర్షపాతం నమోదైంది.
అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం తోడైంది. దీంతో అతి భారీ వర్షాలకు అవకాశముందని అధికారులు అంచనా వేశారు. కోస్తా తీరంలో, నెల్లూరు జిల్లాలో వరి నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. రాబోయే 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరి నూర్పిడి చేపట్టవద్దని తెలిపారు.
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. లంబసింగిలో కనిష్ఠంగా 6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఏపీ తెలంగాణలో 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం దాటే సమయంలో చలి తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు.