ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు చాలా సులువుగా దొరుకుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్నవారు అక్కడకు వెళ్ళి తమకు కావలసినన్ని సర్టిఫికెట్లు కొనుక్కోవచ్చు. అలాంటి 52వేల డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు జరిపిన పోలీసులు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బైటపెట్టారు. భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళేవారికే కాదు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. ఆ సర్టిఫికెట్లేవీ చెల్లవని వారు స్పష్టంగా వెల్లడించారు. (మొత్తం 52,594)
రాయబరేలీ జిల్లా సలోన్ బ్లాక్‌లోని 11 గ్రామాలు పూర్తిగా ఇదే వృత్తిలో ఉన్నాయి. పాల్హీపూర్లో అత్యధికంగా 13,707 దొంగ సర్టిఫికెట్లు లభ్యమయ్యాయి. నూరుద్దీన్పూర్లో 10,151 నకిలీ సర్టిఫికెట్లు, పృథ్వీపూర్‌లో 9393 నకిలీ సర్టిఫికెట్లు లభించాయి. సండా సైదాన్లో 4897, మాధోపూర్ నైనాయాలో 3746, లాహూరేపూర్లో 3780, గఢీ ఇస్లాంనగర్‌లో 2255, ఒనానిష్లో 1665, గోపాలపూర్‌లో 225, దుభన్లో 2 నకిలీ సర్టిఫికెట్లు లభించాయి.
ఈ కుంభకోణం భారత సరిహద్దులను దాటేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి పొరుగు దేశాల వారు మాత్రమే కాక బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, పంజాబ్ వంటి భారతీయ రాష్ట్రాల వారికి కూడా నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తారు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
దర్యాప్తులో వెల్లడైన విషయాలను బట్టి… దొంగ సర్టిఫికెట్ల తయారీదారులు ప్రతీరోజూ గరిష్టంగా వెయ్యి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారుచేస్తారు. నిజానికి అధీకృత కంప్యూటర్ నుంచి 24 గంటల వ్యవధిలో గరిష్ఠంగా వంద సర్టిఫికెట్లు మాత్రమే జనరేట్ అవుతాయి. కానీ కుట్రదారులు దాన్ని కూడా మార్చేసారు. ఒకే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో సర్టిఫికెట్లను ప్రోసెస్ చేయిస్తారు. దాన్నిబట్టి వివిధ రాష్ట్రాల్లోని పలువురు వ్యక్తులు చేతులు కలిపి ఈ స్కామ్‌ను నడిపిస్తున్నారని పోలీసులు వివరించారు.
యూపీ ప్రభుత్వం స్థానిక విలేజ్ డెవలప్మెంట్ అధికారి (వీడీఓ)కు కేటాయించిన మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్లను ఆమోదించడానికి కావలసిన ఓటీపీ సంఖ్యలన్నీ ఆ మొబైల్‌కే వస్తాయి. వాటిని ఉపయోగించి, సర్టిఫికెట్లపై ఆమోద ముద్ర వేసేస్తున్నారు.
ప్రధాన అరెస్టులు:
ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి మొహమ్మద్ జీషన్ రాయబరేలీలోని సలోన్ ప్రాంతానికి చెందిన వాడు. అతని అనుచరులు రియాజ్, సుహేల్ ఖాన్, విజయ్ సింగ్ యాదవ్ అనేవారు తోడుదొంగలు. వారిని యూపీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఎన్ఐఏ, ఏటీఎస్, యూపీ పోలీసులతో కలిసి మరింతమంది తోడుదొంగలను బంధించాలని ప్రయత్నిస్తున్నారు.
అసలు ఈ కుంభకోణం ఎలా వెలుగు చూసింది?
ఈ స్కామ్‌ను మొట్టమొదట జులై 2024లో కనుగొన్నారు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు అక్కడి జనాభా కంటె ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతుండడంతో అనుమానించి ఫిర్యాదు చేసారు. ఆ తేడాలతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం గురించి చాలామంది గ్రామపెద్దలకు తెలియనే తెలియదు. విజయ్ సింగ్ యాదవ్ ఈ అక్రమాల్లో తన పేరు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో అతనే ఫిర్యాదు చేసాడు. అయితే పోలీసు దర్యాప్తులో ఈ స్కామ్‌కు ప్రధాన పాత్రధారి అయిన జీషన్‌కు కీలక ఫోన్ నెంబర్ ఇచ్చింది విజయ్ సింగే అన్న విషయం వెల్లడైంది.
ఈ స్కామ్ తర్వాత జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా వహించాలని జిల్లా అభివృద్ధి పంచాయత్ రాజ్ అధికారులను (డిపిఆర్ఓ) ఉన్నతాధికారులు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి భారీస్థాయి మోసాలు జరక్కుండా వ్యవస్థాగత మార్పులు ప్రారంభించారు.