స్వచ్ఛ అవార్డులను కొల్లగొట్టి ప్రత్యేకతను చాటుకున్న ఇండోర్ మరో ఘనత సాధించబోతోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి యాచకులను నిషేధించారు. అంతేకాదు. యాచకులకు ఎవరైనా డబ్బు ఇస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఇండోర్ కలెక్టర్ అశిశ్ సింగ్ హెచ్చరించారు. యాచకులు లేని నగరంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు.
పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరం ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. ఇక యాచకులు కూడా లేకుండా చేసి మరో మెట్టు ఎక్కించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాచకులను నిషేధించారు. అంతేకాదు వారికి డబ్బులిచ్చినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
యాచకులను నిషేధిస్తే విదేశీ పర్యాటకులు పెరుగుతారని అధికారులు భావిస్తున్నారు. విదేశీ పర్యాటకులను యాచకులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. విదేశీ పర్యాటకులను గుర్తించి యాచకులు గుంపులుగా వారివెంట పడుతున్నారని, దీంతో దేశం పరువు పోతోందని వారు చెబుతున్నారు. యాచకులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, వారికి సాయం చేసే వారిపై కూడా కేసులు పెట్టాలని నిర్ణయించారు.