తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన ఆలయ కార్యకర్త రంగరాజన్ నరసింహన్‌ను చెన్నయ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేసారు. సామాజిక మాధ్యమాల్లో రంగరాజన్ నరసింహన్ చేసిన ఒక పోస్ట్ కారణంగానే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రంగరాజన్ నరసింహన్… తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకూ, ఉపముఖ్యమంత్రీ అయిన ఉదయనిధి స్టాలిన్ గురించి, చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరుకు చెందిన ఎంబార్ జీయర్ స్వామి గురించీ… ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ ట్వీట్ చేసారు.
శ్రీపెరంబుదూరుకు చెందిన జీయర్ స్వామి డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదులో ఆయనకు, ఉపముఖ్యమంత్రికీ సంబంధం ఉందన్నట్లుగా రంగరాజన్ నరసింహన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారని ఆయన ఆరోపించారు. ఆ ఫిర్యాదు తర్వాతే రంగరాజన్ నరసింహన్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.
చెన్నై నుంచి ఒక పోలీసు బృందం శ్రీరంగం వెళ్ళింది. అక్కడ నరసింహన్‌ను పట్టుకున్నారు. ఆయనను మరిన్ని వివరాల గురించి ప్రశ్నించాల్సి ఉందంటూ చెన్నై తీసుకువెళ్ళారు. దర్యాప్తు తర్వాత రంగరాజన్ నరసింహన్‌ను కోర్టులో ప్రవేశపెడతామంటూ అధికారులు ధ్రువీకరించారు.
రంగరాజన్ నరసింహన్ తమిళనాడులో ఆలయాల గురించి పోరాడే వ్యక్తి. ఆలయాల నిర్వహణ గురించి ఆయన తరచుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేస్తూంటారు. గతంలోనూ ఒక పారిశ్రామికవేత్త గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టినప్పుడు గొడవైంది. అప్పుడు తమిళనాడు హైకోర్టు రంగరాజన్‌ను ఆ పారిశ్రామికవేత్తకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.