ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం సాయంత్రానికి అల్పపీడనంగా, మంగళవారంనాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు, ఒడిషాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. రాబోయే 3 రోజులపాటు ఏపీలోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి శనివారం వరకు ఏపీలోని రాయలసీమ జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఉత్తరకోస్తాలోనూ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు ఉత్తరకోస్తాలో తీరందాటే అవకాశముందని తెలుస్తోంది.
అల్పపీడనం ప్రభావంతో పంటలు నూర్పిడి చేస్తోన్న రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వరి కోత కోసిన రైతులు కట్టలు కట్టి తడవకుండా గూడులా వేసుకోవాలని సూచించారు. నూర్పిడి పనులు 3 రోజులు వాయిదా వేసుకోవాలని చెప్పారు. పొగాకు, పత్తి పంటలను వర్షాల నుంచి రక్షించుకోవాలని సూచించారు.