1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్ పశ్చిమ, తూర్పు భాగాలలోని ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పాటు చేసారు. తూర్పు ప్రాంతంలో బెంగాల్‌లోని భాగాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో సుమారు 7.5కోట్ల మంది జనాభా ఉండేవారు. హిందువులూ ముస్లిములూ ఇద్దరూ ఉండే ఆ ప్రాంతీయులు బెంగాలీ మాట్లాడేవారు. బెంగాలీ ముస్లిములకు ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన రాజకీయ భావజాలాలూ ఉండేవి. వారు ఉదారవాదులు, సాధారణ ముస్లిముల్లా తీవ్రమైన భావజాలం లేనివారు. అంతే కాదు. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ ప్రాంతాల మధ్య 16వందల కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉంది. ఆ రెండు ప్రాంతాల ఆలోచనా ధోరణి, భాష, ఆహార విహారాలు, ఆహార్యం అన్నీ వేర్వేరుగా ఉండేవి.
పశ్చిమ పాకిస్తాన్‌లోని అధికారులు బెంగాలీ భాషను, సంస్కృతినీ అణచివేయడానికి, ఒక్కమాటలో చెప్పాలంటే వారి అస్తిత్వాన్నే తుడిచిపెట్టేయడానికి ప్రయత్నించారు. ఆ అన్యాయపు ప్రయత్నాలు అప్పటికే గాయపడి ఉన్న తూర్పు పాకిస్తాన్ ప్రాంతవాసుల హృదయాల్లో అగ్గి రాజేసాయి.
తూర్పు బెంగాల్ (తూర్పు పాకిస్తాన్) ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న కోరిక బలం పుంజుకోవడం ప్రారంభమైంది. 1951లో పాకిస్తాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించడంపై తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. బెంగాలీని కనీసం రెండవ భాషగా అయినా గుర్తించాలన్న వారి విజ్ఞప్తిని పాకిస్తానీ అధికారులు పట్టించుకోలేదు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ల నడుమ 1947 నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. 1970 ఎన్నికలు తూర్పు పాకిస్తాన్ ప్రజల నిజమైన ఆకాంక్షలకు అద్దం పట్టాయి. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడ్డాక అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన మొట్టమొదటి ఎన్నికలు. షేక్ ముజిబూర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీలీగ్ చారిత్రక విజయం సాధించింది. కానీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారికున్న హక్కును పశ్చిమ పాకిస్తాన్ నిరాకరించింది. ఆ ప్రాంతపు ప్రధానమంత్రి యాహ్యాఖాన్, తూర్పు పాకిస్తాన్లో సైనిక పాలన (మార్షల్ లా) విధించాడు.
ఆ క్రమంలో 1971కి కొన్ని నెలల ముందు తూర్పు పాకిస్తాన్లో నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. రక్తపాతం చోటు చేసుకుంది. పాకిస్తానీ సైన్యం తూర్పు ప్రాంతంలో చేపట్టిన అమానుష చర్యలను, యూదుల మీద హిట్లర్ జాత్యహంకార దాడులు, నరమేధంతో పోల్చారంటే ఆ సైన్యం అరాచకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్ వాసుల్లో తమ ప్రాంతం పట్ల దేశభక్తిని, తమ భాషాభిమానాన్నీ తుడిచిపెట్టేయాలని పాక్ సైన్యం నిర్ణయించుకుంది. దానికోసం ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ మొదలుపెట్టింది. బెంగాలీ జాతీయవాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేసారు. ఆ క్రమంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఘర్షణలో పురుషులు, స్త్రీలు అందరూ కీలక పాత్ర పోషించారు.
పశ్చిమ పాకిస్తాన్‌లోని ముస్లిం మతగురువులు బెంగాలీ స్వతంత్ర పోరాట యోధులను ‘హిందువులు’ అని పిలిచేవారు. నిజానికి అప్పట్లో బెంగాలీ జనాభాలో 80శాతం మంది ముస్లిములే ఉండేవారు. అంతేకాదు… తూర్పు పాకిస్తాన్ వాసులను అణచివేయడానికి, బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటాన్ని తుడిచిపెట్టేయడానికీ బెంగాలీ మహిళలపై అఘాయిత్యాలకు (రేప్‌లు) పాల్పడ్డారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటాన్నిబలహీనపరచాలన్నది వారి మౌలిక ఉద్దేశం. దాంతో పాకిస్తానీ సైన్యం తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది. ఇంక మహిళా ఉద్యమకారులపై పాక్ సైన్యంతో పాటు వారి మద్దతుదారులు కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డారు. పాకిస్తానీ సైనికులు కనబడిన ఆడదాన్నల్లా రేప్ చేసారు. వారి లక్ష్యం ఒక్కటే, ఆ మహిళలను గర్భవతులను చేయడం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగిన 9 నెలల వ్యవధిలో పాకిస్తాన్ సైన్యం, బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ మూకలు కలిసి 20-30 లక్షల మందిని చంపేసారు. 2-4లక్షల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే పాకిస్తాన్ గణాంకాల ప్రకారం కేవలం 2 నుంచి 4 లక్షల మంది మహిళలను చెరిచారు. పాక్ సైన్యం ఉత్తర్వుల కారణంగా లక్షలాది ప్రజలను చంపేసారు. వారిలో అత్యధికులు ముస్లిములే. అంతేకాదు, భారత సైన్యానికి పాక్ సైన్యం లొంగిపోడానికి రెండు రోజుల ముందు కూడా, అంటే 1971 డిసెంబర్ 14న పాక్ సైన్యం వందమంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, రచయితలు, ఇంజనీర్లను ఎత్తుకుపోయి, వారిని చంపేసి ఒకే సమాధిలో పూడ్చిపెట్టింది.
బంగ్లాదేశ్‌లో ‘ముక్తివాహిని’ తనదైన పద్ధతిలో యుద్ధం చేస్తోంది. కళాశాల విద్యార్ధులు, సామాన్య ప్రజలు అందరూ స్వతంత్రం కోసం, పాకిస్తాన్ పరపీడన నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్ సాయపడింది. వారికి రేషన్ సామాన్లు, సైన్యాన్ని పంపించింది. ఆ యుద్ధం సమయంలో వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్‌లో ఆశ్రయం పొందారు.
డిసెంబర్ 3న పాకిస్తాన్ భారతదేశపు 11 ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది. దానికి ప్రతిగా భారత్ సైతం తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతాల్లో వైమానిక దాడులకు పాల్పడింది. అప్పుడు మన దేశం మన సైన్యానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి, తూర్పు పాకిస్తాన్ ప్రజలను రక్షించాలని ఆదేశించింది. ఆ యుద్ధంలో భారత సైన్యాలకు ఫీల్డ్ మార్షన్ శామ్ మానెక్ షా నాయకత్వం వహించారు. పాకిస్తాన్‌తో జరిగిన ఆ యుద్ధంలో 1400కు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైనికులు అత్యుత్త ధైర్యసాహసాలు ప్రదర్శించి పాక్ సైనికులను ఒక్క అడుగైనా ముందుకు వేయకుండా అడ్డుపడ్డారు. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ యుద్ధం కేవలం 13 రోజుల్లోనే ముగిసిపోయింది. 1971 డిసెంబర్ 16న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎఎ ఖాన్ నియాజీ సుమారు 93వేల మంది సైనికులతో భారతదేశానికి లొంగిపోయాడు.
దానికి ప్రతీకగానే ప్రతీ యేడాదీ డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తారు. ఆనాటి యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ రోజుల భారత ప్రధానమంత్రి నుంచి సామాన్య భారతీయుడి వరకూ అందరూ, దేశం కోసం అత్యుత్తమ త్యాగం చేసిన ఆ వీర జవాన్లకు జోహారులర్పిస్తారు.
1971 యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్ సైతం పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నాయి. 1971 డిసెంబర్ 14న భారత సైన్యం ఢాకాలోని పాకిస్తాన్ గవర్నర్ నివాసంపై దాడి చేసింది. మన వైమానిక దళం సైతం ఆ యుద్ధంలో పాకిస్తాన్ గగనతలంలో లెక్కలేనన్ని సార్లు ప్రయాణించింది. అలా తూర్పు పాకిస్తాన్ గగనతలం మీద భారత్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. యుద్ధం మొదటి వారం చివర్లో భారత వైమానిక దళం దాదాపు గగనతలంపై పూర్తి పట్టును సాధించి ఉండేది. దానికి కారణం మొత్తం పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను సమర్థంగా తుడిచిపెట్టేయడమే.
ఆ యుద్ధంలో భారతీయ నౌకాదళం సైతం తమవంతు పాత్ర పోషించింది. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నౌక ఫైటర్ జెట్స్తో చిట్టగాంగ్, బరిసాల్, కాక్స్ బజార్ ప్రాంతాలపై దాడులు చేసింది. ఫలితంగా పాక్ నౌకాదళం తూర్పు విభాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. తూర్పు పాకిస్తాన్ రేవులు మూసుకుపోయాయి. దాంతో ట్రాప్ అయిపోయిన పాకిస్తానీ సైనికులు తప్పించుకోడానికి ఏ దారీ మిగల్లేదు.
అదే సమయంలో పాకిస్తాన్ ఉన్నతాధికారులందరూ సమావేశమయ్యారు. భారత్ ప్రతిదాడి తీవ్రత పాకిస్తాన్‌ను గజగజలాడించింది. దాంతో పాక్ జనరల్ నియాజీ కాల్పుల విరమణ చేస్తామంటూ ప్రతిపాదించాడు. ఫలితంగా డిసెంబర్ 16 రాత్రి భారతదేశం సుమారు 93వేల మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశం ఏర్పడింది. ఆ యుద్ధం భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టింది. ఆ సందర్భంగానే భారత సైన్యం విజయానికి గుర్తుగా 1971 డిసెంబర్ 16ను ‘విజయ్ దివస్’ గా జరుపుకుంటాము. ఆ యుద్ధంలో సుమారు 3900 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. సుమారు 10వేల మంది గాయపడ్డారు. యుద్ధం జరిగిన 8 నెలల తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలు సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసాయి. దానిప్రకారం పాకిస్తానీ యుద్ధ ఖైదీలను భారత్ విడిచిపెట్టేసింది.
విజయ్ దివస్ – ఆర్ఎస్ఎస్ :
భారత వీరసైన్యం 97,368 మంది పాకిస్తానీ సైనికులను విడిచిపెట్టేసిన రోజును గౌరవించుకుంటూ, ఆ విజయం స్ఫూర్తిని స్వయంసేవకుల మనసుల్లో నింపి వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతీయేటా డిసెంబర్ 16న ‘ప్రహార్ మహాయజ్ఞ’ నిర్వహిస్తుంది.
ఆ రోజు స్వయంసేవకులకు భారతీయ రాజుల శక్తిసామర్థ్యాల గురించి వివరిస్తారు. మహారాణా ప్రతాప్ తన గుర్రం చేతక్ మీద ఎక్కి హల్దీఘాటీ యుద్ధంలో ఒక్కవేటుకు బహదూర్ ఖాన్ తలను తెగనరికాడు. రాణి దుర్గావతి తన గుర్రం పగ్గాలను నోటితో పట్టుకుని రెండు చేతుల్లోనూ రెండు ఖడ్గాలు ధరించి శత్రువులను దునుమాడింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ తన ఖడ్గచాలనంతో ఆదిల్షాహీ, మొగల్ సామ్రాజ్యాలను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాంటి గొప్ప వీరుల వారసులం మనం. ఆ శక్తి మన భుజాల్లో శాశ్వతంగా ఉండాలి. భారతీయులు సర్వశక్తివంతులుగా, సర్వసమర్థులుగా కొనసాగాలి. అదే విజయ్ దివస్ మనకు అందించే స్ఫూర్తి.