ఐపీఓల హవా కొనసాగుతోంది. 2024లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 89 కంపెనీలు లక్షన్నరకోట్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025లో 92 కంపెనీలు లక్షన్నర కోట్లకుపైగా పెట్టబడులు సమీకరించనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 32 కంపెనీలు 42 వేల కోట్లు సమీకరించుకునేందుకు సెబీ అనుమతించింది. మరో 63 కంపెనీలు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. మొత్తం మీద 2025లో 90కిపైగా కంపెనీలు లక్షన్నర కోట్ల పెట్టుబడులు సమీకరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
వచ్చే ఏడాది వచ్చే ఐపీఓల్లో ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హెచ్‌డిబీ ఫైనాన్స్, హెగ్జావేర్ టెక్నాలజీస్, ఎథర్ ఎనర్జీ, ఎన్‌ఎస్‌డిఎల్, హీరో ఫిన్ కార్ప్ కంపెనీలు లక్షకోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందాయి. మరికొన్ని కంపెనీలు కూడా సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.
2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే సమయంలో దేశంలో పెట్టుబడులు దారుణంగా పడిపోయాయి. 2014లో కేవలం 4 కంపెనీలు మాత్రమే ఐపీవోకు వచ్చాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పెట్టుబడులు క్రమంగా పెరిగాయి. కోవిడ్ సమయంలో స్వల్పంగా తగ్గినా 2024నాటికి గరిష్ఠానికి చేరాయి. తాజాగా సగటున ఏటా 93 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. లక్షన్నరకోట్ల పెట్టుబడులను సేకరిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా భారత్‌లో పెట్టుబడులు మాత్రం దూసుకెళుతున్నాయి. మేడిన్ ఇండియా నినాదంతో భారత్ రూపొందించిన ఈజీ బిజినెస్ పాలసీలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో దేశంలో అనేక నూతన పరిశ్రమల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.