శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనియాడిన సీఎం చంద్రబాబు
సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నసీఎం చంద్రబాబు, శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దోహదం చేసిందన్నారు. ఆయన ప్రాణ త్యాగం కారణంగానే తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపాలని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారని గుర్తు చేసిన చంద్రబాబు, నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చినట్లు వివరించారు. త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేస్తామన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించిందని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే’’ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రంలో మన పరపతి పెరగడంతో రాష్ట్రానికి మంచి జరుగుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.