ఛత్తీస్గఢ్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు జరిగిన పేలుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో నెల రోజుల్లోనే 43 మంది మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు, బీజేపీ నేతలపై మావోయిస్టులు పగ తీర్చుకునేందుకు ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలున్నాయంటూ కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ సమయంలో ఛత్తీస్గఢ్లో కేంద్ర హోం మంత్రి రెండు రోజుల పాటు పర్యటన జరపాలని నిర్ణయించారు.
తాజాగా ఆదివారం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తోన్న సమయంలో పేలుడు పదార్థాలు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసే క్రమంలో ఓ సైనికుడు గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లో జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. 2026 చివరి నాటికి మావోయిస్టులందరినీ ఏరివేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో జరగబోతోన్న పర్యటన ఆసక్తిగా మారింది.