బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ పై ఆసీస్ భారీ స్కోర్ చేసింది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయినప్పటికీ రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించింది. 101 ఓవర్లలో ఆసీస్ ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగులు చేసింది.
ఓవర్ నైట్ స్కోర్ 28తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్, లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(21), నాథన్ మెక్‌స్వీని(9) పెవిలియన్ బాట పట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, లబుషేన్ నెమ్మదిగా ఆడారు. స్కోర్ బోర్డు 75 పరుగుల వద్ద ఉన్నప్పుడు నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి లబుషేన్ (12) పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెడ్( 152), స్టీవెన్ స్మిత్ (101) రాణించారు. స్మిత్ చివరగా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ సాధించాడు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత భారీ స్కోర్ చేశాడు . ఈ ఇన్నింగ్స్ లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్, 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్‌కు భారత్ పై ఇది 10వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 33వ టెస్టు సెంచరీ.
ట్రావిస్ హెడ్ ఈ సిరీస్ లో వరుసగా రెండో శతకం బాదాడు. కేవలం 115 బంతుల్లోనే శతకం కొట్టాడు. కెరీర్లో తొమ్మిదో శతకం చేసిన హెడ్.. భారత్‌పైనే మూడు సార్లు సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (5), కమిన్స్( 20) భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి అలెక్స్ కేరీ(45*), మిచెల్ స్టార్క్(7*) క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా నితీశ్ రెడ్డి, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.