జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే జరుగుతాయని ఆయన చెప్పారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పుడు తామే అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతలు చేస్తోన్న ప్రచారంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబునాయుడు ఈ విషయం చెప్పారు.
సీఎం చంద్రబాబునాయుడు జమిలి ఎన్నికలపై స్పష్టత నివ్వడంతో దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెడతారని ఊహించారు. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణలు కూడా జరగాల్సి ఉంది. అప్పుడే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. అయితే పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు తేవడం ద్వారా అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. సోమవారం బిల్లు పెడతారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.