దేశ వ్యాప్తంగా చర్చకుదారితీసిన బెంగళూరు సాప్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాధితుడు రాసిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నోటీసులు అందించిన పోలీసులు తాజాగా అతుల్ భార్య నిఖితా సింఘానియాను అరెస్ట్ చేశారు. ఆమె సోదరుడు అనురాగ్, తల్లి నిషాను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఓ ఐటీ కంపెనీలో డైరెక్టరుగా ఉన్న అతుల్ బెంగళూరు మారతహళ్లిలోని మంజునాథ లే అవుట్లో ఉంటున్నారు. అక్కడే ఆయన గత వారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతుకు ముందు ఆయన రాసిన సూసైడ్ లేఖ, వీడియో వైరల్ అయ్యాయి.
ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అతుల్ భార్యను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సుశీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే అతుల్ భార్య నిఖితా సింఘానియాకు పోలీసులు నోటీసులు అందించారు.
ఆత్మహత్యకు ముందు అతుల్ రాసిన 40 పేజీల సుదీర్ఘ లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తన సోదరుడు, పోలీసులకు మెయిల్ ద్వారా పంపించారు. ఆయన విడుదల చేసిన 80 నిమిషాల వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. తన భార్య, ఆమె తల్లి, భావమరుదులు తనను వేధించిన తీరును అతుల్ వీడియోలో వివరించారు. తనను వేధించి వారు తన వద్ద నుంచి తీసుకుంటోన్న లక్షలాది రూపాయలు, తన శత్రువులు మరింత బలపడి, తనను దెబ్బతీయడానికి ఉపయోగపడుతోందని వాపోయాడు.
తనకు విడాకులు ఇవ్వడానికి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని వీడియోలో వివరించాడు. తన మరణం తరవాత అయినా తనకు న్యాయం జరుగుతుందని అప్పుడు తన శవాన్ని గంగా నదిలో కలపాలని, న్యాయ జరగకుంటే కోర్టు గుమ్మానికి వేలాడదీయాలని కోరాడు. అతుల్ లేఖ చదివి లక్షలాది టెకీలు స్పందించారు. ఆయనకు మద్దతుగా నిలిచారు.