తనఖా లేని రుణాల పరిమితి పెంపు
ఇక నుంచి బ్యాంకుల్లో రెండు లక్షల వరకు అప్పు
వ్యవసాయదారులకు భారత రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. సాగు అవసరాలకు ఎలాంటి తాకట్టు లేకుండా అందజేసే రుణ సదుపాయాన్ని పెంచింది. ప్రస్తుతం ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, దానిని రూ.2 లక్షల వరకూ పెంచింది. రానున్న ఏడాది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. పంట పెట్టబడి ఖర్చు, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలించి ఆర్బీఐ ఈ పరిమితిని పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి మేలు జరగనుంది.
ఆర్బీఐ నిబంధనల మేరకు భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. ఫిక్స్డు డిపాజిట్లు ఉన్న రైతులకు రుణాలు మంజూరు చేస్తూ వాటినే రైతురుణాలుగా బ్యాంకులు చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకుంటున్నారు.దీంతో ప్రకృతి వైఫరిత్యాలు, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ సిఫార్సులతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.