ప్రతీ దశలోనూ రాజ్యాంగాన్ని సవాల్ చేశారని మండిపాటు
లోక్ సభలో రాజ్యాంగంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ
నెహ్రూ, ఇందిర, రాజీవ్ తో పాటు వారి రాజకీయవారసుల తీరుపై విమర్శలు
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్సభలో రెండ్రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ, ‘‘ప్రధానులుగా నెహ్రూ, ఇందిర, రాజీవ్ ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించారు’’ అని దుయ్యబట్టారు. దేశ భిన్నత్వంలో విషబీజాలు నాటాడంతో పాటు ప్రతీ దశలోనూ ఆ కుటుంబం రాజ్యాంగాన్ని సవాల్ చేసిందన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడానికి తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగ సవరణ చేయించారని విమర్శించారు. ఎంపీగా ఇందిర గాంధీ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే తీర్పును ఆమె ధిక్కరించారని గుర్తు చేశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అత్యయిక పరిస్థితినే విధించారని అన్నారు. వారి తర్వాతి తరం కూడా ఇదే విధమైన తరహాలో ముందుకు సాగడం ఆందోళన కలిగిస్తోందని రాహుల్, ప్రియాంకలను పరోక్షంగా చురకలు అంటించారు.
సామాన్య కుటుంబాల్లో పుట్టినప్పటికీ తాను ఈ స్థాయికి రావడానికి రాజ్యాంగ బలమే కారణమన్నారు. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు.
1947 నుంచి 1952 వరకు భారత్ కు ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడంతో ఆ సమయంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు ఓ కుటుంబం ప్రయత్నించిందని నెహ్రూ పాలనను ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సవరణలు చేయడంతో పాటు ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారని అన్నారు. గరీబీ హటావో అని ఇందిర ఇచ్చిన నినాదంలో చిత్తశుద్ధి లేదన్నారు. పేదరికం అంటే ఏమిటో వాళ్లకు తెలియదని ఎద్దేవా చేశారు.
బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసిన ప్రధాని మోదీ, మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు ఉండబోవని తేల్చి చెప్పారు. మత రిజర్వేషన్లను రాజ్యాంగ పరిషత్ వ్యతిరేకించిందని గుర్తు చేసిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ మాత్రం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుందన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలికి , పాలనలో ఆశ్రిత పక్షపాతానికి కాకుండా ప్రతిభకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా 11 సంకల్పాలను ప్రతిపాదించారు.