పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ కాలానికి సంబంధించిన వివరాలు ఆ నాణేల వల్ల తెలిసాయి. ‘చీకటి యుగం’ అని వ్యవహరించే ఆ కాలం సింధు లోయ నాగరికత పతనానికీ, బుద్ధుడి ఆగమనానికీ మధ్యలోని సమయం.
రాజస్థాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియాలజీలో రిటైర్ అయిన న్యూమిస్మాటిస్ట్ (నాణేల నిపుణుడు) జాఫరుల్లా ఖాన్ డిసెంబర్ 5న మీరట్‌లో జరిగిన నేషనల్ న్యూమిస్మాటిక్స్ కాన్ఫరెన్స్‌లో తన పరిశోధన విశేషాలను వెల్లడించారు. రాజస్థాన్‌లోని అహర్ (ఉదయ్‌పూర్), కాళీబంగ (హనుమాన్‌గఢ్), విరాట్‌నగర్ (జైపూర్), జానకీపురా (టోంక్) వంటి కీలకమైన ప్రదేశాల్లో దొరికిన నాణేల విశేషాలపై ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ విశేషాలు అప్పట్లో ఆ ప్రాంతం అంతటా విస్తరించిన వాణిజ్య వ్యవస్థ గురించి ఎన్నో వివరాలు తెలియజేసాయి. అంతేకాదు, రాజస్థాన్‌లో దొరికిన నాణేలకు, మిగతా భారతదేశం అంతటా – అంటే పెషావర్ నుంచి కన్యాకుమారి వరకూ – లభించిన నాణేలకు మధ్య పోలికలను కూడా జాఫరుల్లా ఖాన్ వివరించారు. ఖాన్ తన కెరీర్లో ఆ కాలానికి చెందిన రెండు వేలకు పైగా నాణేల గురించి అధ్యయనం చేసాడు. ఆ కాలంలో ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక ఆదాన ప్రదానాల గురించి ఆయన విలువైన వివరాలను కనుగొన్నారు.
ఆ నాణేల మీద సూర్యుడు, షట్చక్రం, మేరు పర్వతం వంటి చిహ్నాలు ఉన్నాయి. ఆ నాణేలను వెండి, రాగి వంటి లోహాలతో తయారు చేసారు. ప్రతీ నాణెమూ 3.3 గ్రాముల సమానమైన బరువు కలిగి ఉంది.
జాఫరుల్లాఖాన్ ప్రస్తావించిన నాణేల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి… 1935లో టోంక్ వద్ద కనుగొన్న 3300 నాణేలు, 1998లో శికర్ దగ్గర కనుగొన్న 2400 నాణేలు. ఆ ప్రాంతాల్లో లోహ నాణేల తయారీకి ఉపయోగించిన పరికరాలు… మహారాష్ట్రలోనూ, తమిళనాడులోనూ, పెషావర్‌లోనూ లభించిన పరికరాలను పోలి ఉండడం విశేషం. దానర్ధం సుస్పష్టం. భారతదేశపు దక్షిణాగ్రం నుంచి, పెషావర్ వరకూ ఉన్న సుదీర్ఘ ప్రాంతమంతా గొప్ప సాంస్కృతిక, ఆర్థిక నెట్వర్క్ ఉండేదన్నమాట.
ఖాన్ తన పరిశోధనా పత్రంలో చైనీస్ యాత్రికుల గురించి కూడా చెప్పారు. ఫాహియాన్ (399-414 సా.శ), సున్యన్ (518 సా.శ), హుయాన్ సాంగ్ (629 సా.శ) రాజస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో శిథిలాలను గురించి నమోదు చేసారు. అంటే ఆ ప్రాంతాలకు అప్పటికే గొప్ప చారిత్రక ప్రశస్తి ఉంది. వారి కథనాలు, పురావస్తు శాఖ కనుగొన్న ఆధారాలను సమన్వయం చేసి అధ్యయనం చేస్తే మనం కోల్పోయిన గొప్ప కాలం గురించిన వివరాలు తెలుస్తున్నాయి. ప్రాచీనకాలపు వ్యాపారంలో రాజస్థాన్ ఎంత కీలక పాత్ర పోషించిందో అర్ధమవుతుంది.
రాజస్థాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియాలజీ రిటైర్డ్ డైరెక్టర్ ఎ.కె జగధారి ఆ నాణేల మీద విస్తృతంగా పరిశోధనలు చేసారు. రాజస్థాన్‌లోని ఆ పురాతత్వ క్షేత్రాల్లో మరిన్ని సర్వేలు జరిగితే భారత చరిత్రలో కోల్పోయిన ఆ అధ్యాయం మీద వెలుగు ప్రసరిస్తుంది అని ఆయన అభిప్రాయం. ‘‘అదే కాలానికి చెందిన పలు ప్రదేశాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడ తవ్వకాలు జరిపే అవకాశాలు తక్కువ. కాబట్టి ఆ ప్రాచీన కాలానికి చెందిన అద్భుత రహస్యాల ఆవిష్కరణలో రాజస్థాన్‌దే కీలక పాత్ర’’ అని ఆయన చెప్పారు.
‘‘ఆ ప్రాంతపు వాణిజ్య చరిత్రకు, చైనా సిల్క్ రూట్‌కు ఉన్నంత ప్రాధాన్యత ఉంది. గుప్తుల వంశం, మాళవులు, జనపదాలకు సంబంధించిన నాణేలను కనుగొనే ప్రయత్నం కొనసాగుతోంది. ఆ పరిశోధనలు భారతదేశపు ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాల్లో రాజస్థాన్ ప్రాధాన్యాన్ని మరింత నిర్ధారిస్తాయి’’ అని జగధారి చెప్పారు.
రాజస్థాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియాలజీ ఇప్పటివరకూ 2.21లక్షల ప్రాచీన నాణేలను సేకరించింది. రాజస్థాన్ ట్రెజర్ ట్రోవ్ రూల్స్ 1961 కింద వాటిని విభజించి విశ్లేషిస్తున్నారు. ఆ ఆవిష్కరణలు పూర్వసామాన్యశకం 1000 నుంచి 600 సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో రాజస్థాన్ చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యతను వివరించగలవు.