పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ ఛలో మార్చ్ ఉద్రిక్తంగా మారింది. డిసెంబరు 6న ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు పంజాబ్ రైతులు ర్యాలీగా బయలుదేరారు. వారిని హర్యానా పోలీసులు ఢిల్లీ శివారు శంభు వద్ద నిలిపివేశారు. అప్పటి నుంచి వారు అక్కడే మకాం వేశారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు 101 మంది రైతులు ఇవాళ తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు భాష్ఫవాయుగోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో రైతులను నిలువరించారు.
మద్దతు ధరలతోపాటు, తమ 11 డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు రెండేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. రైతు చట్టాల రద్దు, మద్దతు ధరలతోపాటు 11 డిమాండ్ల సాధనకు రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతు చట్టాల్లో సవరణలు కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రం ఇస్తోన్న మద్దతు ధరలు కనీసం 50 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించేందుకు బీజేపీ నేతలు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రైతులు తీవ్ర నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అమలవుతోందని, అంబేద్కర్ రాజ్యాంగం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఘాటు విమర్శలు చేశారు.