ఘటనపై చింతుస్తున్నా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటా …: అల్లు అర్జున్
ఆర్డర్ కాపీ అందకపోవడంతో రాత్రంతా జైల్లోనే…!
సంధ్య థియేటర్ ఘటన విచారకరమన్న హీరో అల్లు అర్జున్, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందన్నారు. సదరు బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ఆవేదన చెందారు. సుమారు 20 ఏళ్ళగా సంధ్య థియేటర్ కు వెళుతున్నట్లు తెలిపిన అల్లు అర్జున్, దాదాపు 30 సినిమాలు అక్కడ చూశానన్నారు. జరిగిన ఘటనకు చింతుస్తున్నా అన్నారు.
ఈ ఎపిసోడ్ లో తనకు అండగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. అవధులు లేని ప్రేమను అందించారని అన్నారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే అరెస్టు వ్యవహారంపై మీడియా అడిగిన రాజకీయ పరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంత కంటే ఎక్కువ మాట్లాడనని స్పష్టం చేశారు.
అల్లు అర్జున అరెస్టు వ్యవహారంలో జరిగిన పరిణామాలను ఎప్పిటికప్పుడు ప్రజలకు వివరించిన మీడియాకు అల్లు అరవింద్ కూడా ధన్యవాదాలు తెలిపారు. అరెస్టు వార్త బయటకు తెలిసినప్పటి నుంచి విరామం లేకుండా అప్ డేట్స్ ప్రజలకు వివరించారని మీడియాను కొనియాడారు.
సంధ్య థియేటర్ లో తాను నటించిన ‘ పుష్ప2’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. శుక్రవారం నాడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అర్జున్ ను శుక్రవారం రాత్రి జైలులోనే ఉంచారు.
హైకోర్టు ఆర్డర్ కాపీ అందడంలో ఆలస్యం అయిందని రాత్రి సమయంలో రిమాండ్ లో ఉన్నవారిని విడుదల చేయడం కుదరదని జైలు అధికారులు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ రాత్రికి జైలులో ఉండి శనివారం ఉదయం విడుదల అయ్యారు. అనంతరం తన నివాసానికి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు ఆర్డర్ కాపీ అందినప్పటకీ జైలు అధికారులు కావాలనే అల్లు అర్జున్ ను అక్రమంగా నిర్బంధించారని న్యాయవాది అశోక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు వివరించారు.